మాట్లాడుతున్న ఆప్కాబ్ మాజీ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పిన్నమనేని బాబ్జి
- కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించకుండా అడ్డుకోవడం దారుణం
- అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేయడం దుర్మార్గం
- వైసీపీ దాడిని ఖండించిన ఆప్కాబ్ మాజీ చైర్మన్ పిన్నమనేని
- బెదిరింపులకు భయపడేది లేదన్న పిన్నమనేని బాబ్జి
…….
సాక్షిత గుడివాడ : కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును పర్యటించనీయకుండా వైసీపీ అల్లరి మూకలు అడ్డుకోవడం దారుణమని ఆప్కాబ్ మాజీ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేత పిన్నమనేని బాబ్జిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక భాస్కర్ థియేటర్లోని కార్యాలయంలో వారు విలేఖర్లతో మాట్లాడారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటన కొనసాగుతోందని చెప్పారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డుపడడం దుర్మార్గమని అన్నారు. కుప్పంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నా క్యాంటీన్ ను ప్రారంభించడాన్ని వైసీపీ ప్రభుత్వం తట్టుకోలేక పోతోందన్నారు. పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ ను ప్రారంభించనీయకుండా ధ్వంసం చేయడం దారుణమన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే గాక టీడీపీ క్యాడర్ ను నిర్వీర్యం చేయాలన్న కుట్రలో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత పర్యటనకు అడ్డంకులు సృష్టించడం ద్వారా రాష్ట్రమంతా ఇవే పరిస్థితులు ఉంటాయన్న సందేశాన్ని వైసీపీ శ్రేణులు ప్రజల్లోకి పంపుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు ఇటువంటి దుశ్చర్యలను సమర్ధవంతంగా తిప్పికొట్టడం జరుగుతుందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయని, వైసీపీ అల్లరి మూకల చర్యలను ప్రజలు దగ్గరగా గమనిస్తున్నారని హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గానికి 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా, రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని, అయినప్పటికీ పోలీసులు సరైన భద్రతా చర్యలు చేపట్టలేదన్నారు. పోలీసులు సమక్షంలోనే అల్లర్లను ప్రేరేపించడం సరికాదన్నారు. వీటికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడే పరిస్థితి లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం పార్టీ నడుచుకుంటోందని, పార్టీ అధినేత చంద్రబాబు, ముఖ్య నేతలపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కుప్పం ఘటనకు బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.