జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
రెవిన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని తహశీల్దార్లతో టీఎం-33, జిఎల్ఎం సక్సేషన్, జీవో 58, 59, బల్క్ సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవిన్యూ సంబంధ దరఖాస్తులపై వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. టీఎం-33కు సంబంధించి 2022 సంవత్సరం వరకు వచ్చిన దరఖాస్తులలో పెండింగ్ వున్న వాటిని వచ్చే వారం లోగా పరిష్కరించాలన్నారు. జిఎల్ఎం సక్సేషన్ కు దరఖాస్తుల ఫైళ్లు వెంటనే సమర్పించాలన్నారు. జీవో 58 అమలులో భాగంగా ఇప్పటి వరకు 3,500 పట్టాల పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కటాఫ్ తేదీ పొడిగించబడినందున ఇంతవరకు దరఖాస్తు చేయని వారిని, దరఖాస్తు చేసి తిరస్కరణకు గురయి వారిని ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జీవో 59 అమలులో భాగంగా డిమాండ్ మేరకు లబ్ధిదారులు మొత్తం చెల్లించేలా చూడాలన్నారు.
ఖమ్మం డివిజన్ లో రూ. 26 కోట్ల డిమాండ్ ఉండగా, రూ. 4 కోట్లు వసూలు అయినట్లు, అదేవిధంగా కల్లూరు డివిజన్ లో రూ. 40 కోట్ల డిమాండ్ ఉండగా, రూ. 5 కోట్లు ఇప్పటికి వసూలు అయినట్లు ఆయన అన్నారు. డిమాండ్ చెల్లించే విధంగా దరఖాస్తుదారుని చైతన్య పరచాలన్నారు. కళ్యాణలక్ష్మి, శాదిముబారక్ దరఖాస్తుల విచారణ ఎప్పటికప్పుడు చేస్తూ, దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. ఇట్టి పథకాన్ని ప్రభుత్వం గ్రీన్ ఛానల్ క్రిందకు తెచ్చినందున బడ్జెట్ కొరకు వేచివుండాల్సిన అవసరం లేదని, కావున తహశీల్దార్లు తమకు వచ్చిన దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకొని మంజూరుకు సమర్పించాలన్నారు. గుర్తించిన బల్క్ సమస్యలపై రైతులు దరఖాస్తులు సమర్పించేలా చూడాలని, సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, డిఆర్వో శిరీష, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు వెంకటేశ్వర్లు, రాంబాబు, సత్యనారాయణ, హౌజింగ్ డిఇ కృష్ణా రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.