SAKSHITHA NEWS

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు రాంపిళ్ళ నరసాయమ్మ కన్నుమూత

సాక్షిత విజయవాడ : బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా వారిని దేశం నుంచి తరిమికొట్టాలనే దృడ సంకల్పంతో బాంబులు సైతం తయారుచేసిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు రాంపిళ్ల నరసాయమ్మ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 95 సంవత్సరాలు. ఆమె భర్త స్వర్గీయ రాంపిళ్ళ సూర్య నారాయణ కూడా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. నరసాయమ్మకి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె పెద్ద కుమారులు హనుమత్ పీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ. రెండవ కుమారులైన రాంపిళ్ల జయ ప్రకాష్ స్వాతంత్ర సమర యోధుల వారసుల సంఘం జాతీయ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు .ఇక మూడవ కుమారుడు గౌరీ శివశంకర్ కొత్తపేటలోని ప్రముఖ దేవాలయమైన పంచముఖ ఆంజనేయ స్వామి వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్నారు. కుమార్తె తమ్మిన గౌరీ బాయి వ్యాపార రంగంలో సేవలు అందిస్తున్నారు. స్వాతంత్ర పోరాట సమయంలో సాయుధ పోరాటం ద్వారా తెల్లదొరలను ఎదుర్కోవాలనే లక్ష్యంతో తన భర్త సర్దార్ రాంపిళ్ళ సూర్యనారాయణ తో కలిసి ఆయన అర్ధాంగిగా విజయవాడ పాల ఫ్యాక్టరీ వద్ద ఎదురుగా ఉన్న కొండపై నరసాయమ్మ బాంబులు తయారు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం నరసాయమ్మ – సూర్యనారాయణ దంపతులపై బెజవాడ బాంబు కుట్ర కేసు పెట్టి అరెస్టు చేయడం జరిగింది. కొన్ని నెలలపాటు బ్రిటిష్ వారు నరసాయమ్మను జైలులో నిర్బంధించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో నాటి సమరయోధులతో కలిసి పెద్ద ఎత్తున పండుగ చేసుకున్న ఉదంతంలో నరసాయమ్మ పాల్గొన్నారు. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గోవా దీవుల విముక్తి పోరాటంలో తన భర్త సూర్యనారాయణ తో కలిపి నరసాయమ్మ కూడా జైలు జీవితం గడిపారు. అప్పుడు జైలులో ఉన్న సమయంలో ఆమె రాంపిళ్ళ జయప్రకాష్ కు జన్మనిచ్చారు. అటుపై దేశ అభ్యున్నతికి గాంధీ మార్గమే ఉత్తమమని తలంచి గాంధీ దేవాలయాన్ని స్థాపించారు. గాంధీ దీక్షలను ప్రచారం చేశారు. స్వాతంత్ర్య అనంతరం కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ సలహా మండలిలో నరసాయమ్మ కు స్థానం కల్పించడంతో ఆమె స్వాతంత్ర సమరయోధుల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేశారు. స్వాతంత్ర సమరయోధులకు పెన్షన్ భారీగా పెంచడంలో నరసాయమ్మ పాత్ర ఎనలేనిది. అలాగే దేశంలోని పలు రాష్ట్రాల్లో స్వాతంత్ర సమరయోధులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పలు సదుపాయాలను కల్పించడంలో నరసాయమ్మ ప్రముఖ పాత్ర వహించారు. గతంలో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, రామనాథ్ కోవింద్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా నరసాయమ్మ పలుమార్లు సత్కారాలను అందుకున్నారు. స్వాతంత్ర సమరయోధురాలు నరసాయమ్మను నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పలు సందర్భాల్లో సముచిత రీతిన సత్కరించడం జరిగింది. అనేక జాతీయ కార్యక్రమాల్లో ఆమె పాల్గొని తన ప్రసంగాల ద్వారా జాతిని ఉత్తేజితం చేశారు. తన మామగారు సయ్యద్ రాంపిళ్ళ అప్పలస్వామి నెల కొల్పిన సయ్యద్ అప్పలస్వామి కళాశాల అభివృద్ధికి ఇతోదికంగా కృషి చేశారు . తన నిరాడంబర జీవిత విధానం ,పరోపకార బుద్ధి తదితర మహోన్నత గుణాల ద్వారా విద్యార్థులకు నరసాయమ్మ ఆదర్శంగా నిలిచారు. కాగా నరసాయమ్మ మృతి వార్త తెలియంగానే పలువురు ప్రముఖులు పాల ఫ్యాక్టరీ వద్ద ఉన్న నరసాయమ్మ స్వగృహానికి తరలివచ్చి నివాళులు అర్పించారు. భారతదేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. నరసాయమ్మ కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు.

WhatsApp Image 2024 11 13 at 4.38.52 PM

SAKSHITHA NEWS