ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి జీవో 58, 59 ప్రకారం క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి.
- జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి జీవో 58, 59 ప్రకారం క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ జీవో నెం. 58, 59 దరఖాస్తుల పరిష్కారం పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
ప్రభుత్వం కటాఫ్ తేదీని 2 జూన్, 2020 గా పొడిగించినందున, రెండో విడత దరఖాస్తుల స్వీకరణ జరిపినట్లు ఆయన తెలిపారు. జీవో 59 క్రింద రెండో విడత దరఖాస్తులకు డిమాండ్ జారీ ప్రక్రియ వెంటనే చేపట్టాలన్నారు. డిమాండ్ జారీ సమయంలో దరఖాస్తుదారులు ఎంత చెల్లించాల్సి ఉంది, ఎప్పటిలోగా చెల్లించాలనే దానిపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. మిగులు జీవో 58 పరిష్కారం ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభి, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.