SAKSHITHA NEWS

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి …..

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, సాక్షిత:

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ ప్రజల దరఖాస్తులను స్వీకరించారు.

టేకులపల్లి ప్రాంతానికి చెందిన శారద తనకు కుట్టు మిషన్ శిక్షణ ఇన్స్పెక్టర్ గా నియమించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాస్తూ అవకాశం మేరకు పరిశీలించాలని అదనపు కలెక్టర్ సూచించారు.

ఖమ్మం నగరానికి చెందిన పి. దేవీ కరుణ తనకు సొంత ఇంటి జాగా లేదని, ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, కలెక్టరేట్ ఐ విభాగానికి రాస్తూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.

సత్తుపల్లి మండలం కాకర్లపల్లి రెవెన్యూ గ్రామ వాసి జొన్నలగడ్డ రాములు తన తల్లి పేరుపై ఉన్న పట్టా మీద సర్వే నెంబర్ 10 గుంటల భూమిలో 2 గుంటలలో అమ్మవారి దేవాలయం నిర్మాణం చేయగా, మిగిలిన భూమి ఆక్రమించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ప్రయత్నిస్తున్నందున తగు చర్యలు తీసుకోవాలని కొరుతూ దరఖాస్తు చేసుకోగా కల్లూరు రెవెన్యూ డివిజన్ అధికారి రాస్తూ చర్యలు తీసుకోవాలని అన్నారు.

అనంతరం జిల్లా అధికారులతో పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులు, బయో మెట్రిక్ అటెండెన్స్, వివిధ అంశాలపై అదనపు కలెక్టర్ సమీక్షించారు.

జిల్లాలో అధికంగా పెండింగ్ ఉన్న ప్రజావాణి దరఖాస్తులను అదనపు కలెక్టర్ శాఖల వారీగా సమీక్షించి దరఖాస్తులను త్వరగా పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. మండలంలో పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులపై మండల ప్రత్యేక అధికారులు శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ తెలిపారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పని చేసే ప్రభుత్వ అధికారుల, సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ పై అదనపు కలెక్టర్ సమీక్షించారు. బయో మెట్రిక్ అటెండెన్స్ తక్కువ నమోదు కావడం పట్ల అదనపు కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ సిబ్బంది రెగ్యులర్ గా బయో మెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలని అన్నారు.

ఫీల్డ్ స్టాఫ్ ప్రభుత్వ కార్యాలయాలకు నివేదికలు సమర్పించే సమయంలో కూడా తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రతి శాఖ అధికారి వారి పరిధిలోని సిబ్బంది అటెండెన్స్ రెగ్యులర్ గా మానిటర్ చేయాలని, పదవీ విరమణ పొందే వారికి కలెక్టరేట్ సమావేశం మందిరంలో సన్మానించడంతో పాటు రిటైర్మెంట్ రోజే బెనిఫిట్స్ అందే విధంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారని, దీనికి సంబంధించి జిల్లా అధికారులు తమ కార్యాలయ పరిధిలో రిటైర్ అయ్యే వారి వివరాలు నిర్దేశిత ఫార్మాట్ లో వెంటనే అందజేయాలని అన్నారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సి.ఈ.ఓ. దీక్ష రైనా, డి.ఆర్.డి.ఓ. సన్యాసయ్య, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, కలెక్టరేట్ పరిపాలన అధికారి అరుణ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ వివిధ సెక్షన్ ల సూపరింటెండెంట్ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS