తెలంగాణలో మరో రెండు గ్యారెంటీల అమలుకు తేదీ ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 27 నుంచి ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రియాంక గాంధీ చేతులు మీదుగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు చేసేందుకు మేడారం వెళ్లిన రేవంత్ రెడ్డి.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27 వ తేదీ సాయంత్రం రెండు గ్యారెంటీలు ప్రారంభమవుతాయన్నారు. ఈ రెండు గ్యారెంటీలు ప్రారంభానికి ముఖ్య అతిధిగా హాజరవుతున్న కాంగ్రేస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ హాజరవుతారని తెలిపారు.
నీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి గురించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించబోతున్నామని.ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే తీపికబురు చెబుతామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను సకాలంలో అందించేలా, ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని వివరించారు. పరిపాలనను గాడిలో పెడుతున్నామని సీఎం రేవంత్ చెప్పారు. ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేస్తున్నామన్నారు. జర్నలిస్టుల సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే మీడియా అకాడమీ ఛైర్మన్‌ను కూడా నియమిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నిపుణుల సూచనల మేరకు ముందుకెళ్తామన్నారు. మేడారం జాతర కోసం ఆరు వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మహిళలకు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
200 యూనిట్ల లోపు విద్యు త్ వాడితే జీరో బిల్లు
మార్చి మొదటివారం నుంచి జారీచేసే విద్యుత్ బిల్లులకు సంబంధించి.. 200యూనిట్లలోపు వాడే అర్హులైన వినియోగదారులకు జీరో బిల్లులు ఇవ్వాలని అధికారులను ఇప్పటికే సీఎం ఆదేశించారు.
అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు వీలుగా విధివిధానాలను సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించిందని.. ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ గ్యారంటీలు అందుతాయి. రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించే పథకంలో ‘ప్రభుత్వ సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా? లేక ఏజెన్సీలకు చెల్లించాలా? ఈ క్రమంలో వచ్చే అడ్డంకులు, ఇబ్బందులపై ఇప్పటికే అధ్యయనం పూర్తి చేశారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నంబర్లు, విద్యుత్ కనెక్షన్ నంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే.. సవరించుకునే అవకాశం ఇవ్వనున్నారు. విద్యుత్ బిల్లుల సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియ చేపట్టనున్నారు..