President Draupadi Murmu will come to Hyderabad for winter vacation on 26th
26న శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,
జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రపతి రాక నేపథ్యంలో జిల్లా అధికారులతో ముందస్తు సమీక్ష సమావేశంలో కలెక్టర్ హరీశ్
మేడ్చల్ జిల్లా సాక్షిత ప్రతినిధి;-
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికై ఈనెల 26న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయా శాఖల అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.
రాష్ట్రపతి రాక నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్యతో కలిసి జిల్లాలోని ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముందస్తు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ఈనెల 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు రానున్నారని తెలిపారు.
రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో జిల్లాలోని హకీంపేట ఎయిర్‌పోర్టుకు ముందుగా చేరుకొంటారని అక్కడ నుంచి బొల్లారంకు రోడ్డు మార్గం ద్వారా వెళ్తారని కలెక్టర్ అధికారులకు వివరించారు. ఈ నేపథ్యంలో హకీంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి రాక సందర్భంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, అవసరమైన మందులు, మెడికల్ కిట్స్ అందుబాటులో ఉండాలని ఆ శాఖ జిల్లా అధికారి డాక్టర్ శ్రీనివాస్‌కు సూచించారు.
అలాగే విద్యుత్తు శాఖ అధికారులు ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని జనరేటర్‌ను కూడా అందుబాటులో ఉంచుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. రాష్ట్రపతి హకీంపేట ఎయిర్ పోర్టు నుంచి బొల్లారం వెళ్ళే రహదారిలో ఎలాంటి గుంతలు, గతుకులు లేకుండా గుంతలను పూడ్చివేయడం కానీ కొత్తగా రోడ్డు వేయడం చేయాలని ప్రయాణం సాఫీగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రోడ్లు, భవనాల శాఖ అధికారులను కలెక్టర్ హరీశ్ ఆదేశించారు.
జిల్లా అటవీ శాఖ అధికారులు హకీంపేట ఎయిర్ పోర్టుతో పాటు రాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో బొల్లారం వరకు అందమైన పూల మొక్కలను ఏర్పాటు చేయడంతో పాటు రహదారికి ఇరువైపులా ఆకర్షణీయంగా కనిపించేలా రకరకాల మొక్కలను ఏర్పాటు చేయాలని ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మొక్కలను ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోగానే అవసరమైన పోలీసు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని ప్రొటోకాల్ ప్రకారం ఆమెను ఆహ్వానించేందుకు వచ్చే వారిని మాత్రమే పంపాలని పోలీసులకు తెలిపారు. దీంతో పాటు ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన రాష్ట్రపతి బయలుదేరి వెళ్ళే సమయంలో అవసరమైన బందోబస్తు కల్పించడంతో పాటు ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించరాదని పోలీసు అధికారులకు వివరించారు.
రాష్ట్రపతి రాక నేపథ్యంలో హకీంపేట ఎయిర్ పోర్టులో అగ్నిమాపక యంత్రాలు (ఫైరింజన్)లను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ హరీశ్ తెలిపారు. దీంతో పాటు మున్సిపల్ కమిషనర్లు శానిటేషన్ విషయంలో అశ్రద్ధ వహించకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్రపతి మొట్టమొదటిసారిగా శీతాకాల విడిదికి వస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని అలాగే తిరిగి వెళ్ళే వరకు అప్రమత్తంగా ఉండాలని సమీక్ష సమావేశంలో కలెక్టర్ హరీశ్ అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్యతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్, ఏసీపీ రామలింగరాజు, జిల్లా అటవీ శాఖ అధికారి జానకీరామ్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు రవి, మల్లయ్య, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.