SAKSHITHA NEWS

శెట్టిపల్లి లో మౌళిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయండి.

కమిషనర్ ఎన్.మౌర్య

నగరపాలక సంస్థ పరిధిలోని శెట్టిపల్లి లో రోడ్లు, మురుగు కాలువలు నిర్మాణం, త్రాగునీటి సరఫరా వంటి మౌళిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం శెట్టిపల్లి, ఉప్పరపాలెం తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, రోడ్లు తదితరాలను ప్రజారోగ్య, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు. రోడ్లు సరిగా లేవని, మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని, త్రాగునీరు నిర్దిష్ట సమయంలో వదలడం లేదని ప్రజలు కమిషనర్ కు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శెట్టిపల్లి, ఉప్పరపాలెంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. మురుగునీటి కాలువలు శుభ్రం చేసి, పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు. ప్రతి రోజూ నీటి సాంద్రత పరిక్షాలు చేపట్టి, ఒక నిర్దిష్ట సమయంలో త్రాగునీరు సరఫరా చేయాలని అన్నారు. రోడ్లు కూడా గుంతలు లేకుండా పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. ఉప్పరపాలెం ప్రజలకు త్రాగునీరు సరఫరా అయ్యేందుకు తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, డి.ఈ.రమణ, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసిపి బాలాజి, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి, తదితరులు ఉన్నారు