సాక్షిత తిరుపతి
జూలై 1 నుండి జరగనున్న జగనన్న సురక్ష కార్యక్రమ క్యాంపులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్దం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సచివాలయ అడ్మిన్లు, ఎడ్యుకేషన్, విఆర్వో కార్యదర్శులతో కమిషనర్ హరిత ఐఏఎస్ సమావేశమై మాట్లాడుతూ జూలై 1 నుండి జరిగే జగనన్న సురక్ష కార్యక్రమల క్యాంపులకు అవసరమైన దరఖాస్తులను సిద్దంగా వుంచుకోవాలని, అదేవిధంగా పందిళ్ళు కోసం సామియాన్లు, కుర్చిలు, త్రాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయించాలన్నారు. ప్రభుత్వం రకరకాల పథకాలు అమలు చేస్తున్నప్పటికి కొన్ని పథకాలకి అవసరమైన కొన్ని సర్టిఫికెట్స్ ప్రజల దగ్గర లేకపోవడం వలన పథకాలకు అర్హులై ఉండి కూడా కొందరు లబ్ది పొందలేక పోతున్నారని, వారందరికి పథకాలకు అవసరమైన సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం కోసం ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు.
ఈ విషయాన్ని సచివాలయ సిబ్బంది ముఖ్యంగా వాలంటీర్లు ఇంటింటికి వెల్లి ప్రజలకి వివరించాలని, వారు ఏమైన పథకాలకు అర్హులై వుండి కూడా పథకాలు అందడం లేదోనని పరిశీలించి, ఆయా పథకాలకు అవసరమైన సర్టిఫికెట్లు ఉంటె వారి చేత ధరఖాస్తులు తీసుకోవాలని, ఓకవేళ అవసరమైన సర్టిఫికెట్లు లేకపోతే, ఆ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు తీసుకోవాలన్నారు. జూలై 1వ తేది ఎన్.జి.ఓ కాలనీ, అంబేద్కర్ కాలనీ 1,2,3, శాంతినగర్ 1,2, అదేవిధంగా మధురానగర్ 15,16 సచివాలయ పరిధిలో క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా ఏ రోజు ఏ సచివాలయం పరిధిలో క్యాంపు నిర్వహిస్తున్నారో ముందస్తుగా ఆయా ప్రాంత ప్రజలందరికీ తెలియజేయాలని కమిషనర్ హరిత ఐఏఎస్ సూచించారు.
కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భూకొనుగోలు అనంతరం ఆన్లైన్లో నమోదు, ఆన్లైన్లో భూవివరాల నమోదులో మార్పులు చేర్పులు, వివాహ ధ్రువీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులో మొబైల్ నంబర్ అప్డేట్, కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్సీ), కొత్తరేషన్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ విభజన వంటి సేవలు ఎలాంటి చార్జీలు లేకుండా అందిస్తున్నట్లు ప్రజలకి తెలపాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సునీత, రెవెన్యూ అధికారి సేతుమాధవ్, సుపర్డెంట్ పి.రవి, పైర్ అధికారి శ్రీనివాసరావు, రెవెబ్యూ ఆర్.ఐ.రామచంద్ర, మునిసిపల్ అర్.ఐలు, సచివాలయ అడ్మిన్లు, ఎడ్యుకేషన్ సెక్రరీలు, విఆర్వోలు పాల్గొన్నారు.