సాక్షిత : పేదలు ఉన్నత ప్రమాణాలతో జీవించాలని ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పేర్కొన్నారు.
జి.కొండూరు మండలంలోని కట్టుబడిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణప్రసాదు మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా లాంటి విపత్తులో కూడా జగనన్న సంక్షేమ పథకాల సొమ్ము ఆగలేదన్నారు. పేదల జీవితాలకు బంగారు బాట వేసేందుకు గతంలో ఉన్న పెత్తందారీ వ్యవస్థను తొలగించి..సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పారదర్శక సేవలను అందిస్తున్నట్లు వెల్లడించారు.
పేదలు ఎక్కడా ఆర్ధికంగా కృంగిపోకూడదనే ఉద్దేశ్యంతో అర్హతలే ప్రామాణికంగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఏమైనా సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాల లబ్దిని పొందలేని వారికి, లోపాలను సరి చేసి పథకాల లబ్ది చేకూర్చాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు అదేశాలు ఇస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.