ప్రత్యామ్నాయంగా మూడు మార్గాల సూచన
- కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఎంపీ రవిచంద్ర వినతి
ఖమ్మం శివారు పాపటపల్లి నుంచి సూర్యాపేట జిల్లా జాన్ పాడు వరకు నూతనంగా నిర్మించ తలపెట్టిన రైల్వే లైన్ తక్షణమే రద్దు చేయాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఈ మార్గంలో లైన్ నిర్మాణం వల్ల రైతులు తమ విలువైన పంట పొలాలు నష్టపోతున్నారని, ప్రత్యామ్నాయ మార్గంలో సర్వే చేయాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఆవరణలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో.. బాధిత రైతు ప్రతినిధులు వల్లూరి పట్టాబి, బానోత్ చంద్రావతి, గుర్రం రాము కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రతిపాదిత రైల్వే లైన్ మార్గంలో ఎక్కువగా దళిత, గిరిజన, పేద రైతులు ఎక్కువ మంది ఉన్నారని.. వీరికి సాగు భూమి తప్ప.. - మరే ఇతర వనరులు లేవని.. భూములు కోల్పోతే రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని బాధిత రైతు ప్రతినిధులు.. రైల్వే మంత్రి కి మొర పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర.. ప్రతిపాదిత లైన్ కు ప్రత్యామ్నాయంగా మరో మూడు మార్గాలను రైల్వే మంత్రి కి సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలను కచ్చితంగా పరిశీలించి.. రైతులకు నష్టం జరగకుండా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే పనులను సైతం నిలుపుదల చేసేలా తక్షణమే ఆదేశాలు ఇస్తానని రైల్వే మంత్రి హామి ఇచ్చారు.
- రైల్వే స్టేషన్ సమస్యలపై కూడా..*
రైల్వే స్టేషన్ లో నెలకొన్న పలు సమస్యలపై ఎంపీ రవిచంద్ర కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న ప్లాట్ ఫాం లను విస్తరించాలని, స్టేషన్ లో డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, శాతవాహన, ఇంటర్ సిటీ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. వీటిపై కూడా రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు.