SAKSHITHA NEWS

Online Jogulamba Goddess Temple Services

ఆన్ లైన్ జోగులాంబ అమ్మవారి ఆలయ సేవలు

వెబ్సైట్ ను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 13: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం అరణ్య భవన్ లో జోగులాంబ అమ్మవారి ఆలయ వెబ్ సైట్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించి, ఆన్ లైన్ సేవలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. భ‌క్తుల‌కు మెరుగైన సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డంతో పాటు వారి సౌక‌ర్యార్ధం ఇప్పటికే 36 ప్ర‌ధాన ఆల‌యాల్లో ఆన్ లైన్ లో పూజలు, వ‌స‌తి బుకింగ్, ప్ర‌సాదం పంపిణీ, త‌దిత‌ర‌ ఆన్‌లైన్ సేవ‌లను భ‌క్తులకు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. దీని వ‌ల్ల భ‌క్తులు అనేక సేవ‌ల‌ను పార‌ద‌ర్శ‌కంగా, సుల‌భంగా పొంద‌గ‌లుగుతున్నారని వివరించారు. దశల వారీగా ఆన్ లైన్ సేవలను విస్తరిస్తున్నామని, అందులో భాగంగానే జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఆన్లైన్ సేవలను ఇవాళ ప్రారంభించుకున్నామన్నారు ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి రావడంతో ఇకపై భక్తులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దర్శన టిక్కెట్లు, పూజలు, అర్చనలు, ఇతర సేవలను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా, భక్తుల సేవలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో కూడా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.

అదే విధంగా కృష్ణ పుష్కరాల సమయంలో సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధి, వసతుల కల్పన కోసం నిధులు కేటాయించారని, ఇప్పటికే జోగులాంబ ఆలయాన్ని పునర్ నిర్మించామని, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రసాద్ స్కీం కింద కూడా ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించిందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆలంపూర్ ఎమ్మెల్యే ఎం. అబ్రహం, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప, ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, ఆలయ ఈవో పురెందర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ ,యూనియన్ బ్యాంక్ డిజిఎం రమణ’ మేనేజర్ ఫణీంద్ర ‘ రంగనాథ్ ,శ్రీనివాస్ ,బ్రహ్మయ్య ఆచారి తదితరులు ఉన్నారు..


SAKSHITHA NEWS