SAKSHITHA NEWS

జాతీయ పంచాయతీ అవార్డులు 20 లో రాష్ట్రానికి 19 అవార్డులు దక్కడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జాతీయ పంచాయతీ అవార్డులు 20 లో రాష్ట్రానికి 19 అవార్డులు దక్కడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు పొందిన గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులకు జరిగిన అభినందన, సత్కార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా గ్రామాలు అభివృద్ధి చెంది, రూపురేఖలు మారినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి కప్పుడు విడుదల చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఎస్డీఎఫ్ క్రింద ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల చొప్పున బీరు. 58.90 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 10 కోట్ల చొప్పున నిధులు మంజూరు అయినట్లు ఆయన అన్నారు. మంజూరు నిధులతో గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమం క్రింద ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాoకర్, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికల నిర్మాణాలు చేసుకున్నట్లు ఆయన అన్నారు. పల్లె ప్రగతి అమలులో జిల్లా టాప్ 3లో ఉన్నట్లు, గ్రామాలు బాగున్నాయని, అందుకే వ్యాధులు తగ్గుముఖం పెట్టినట్లు మంత్రి తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో దేశంలోనే మన రాష్ట్రం, మన జిల్లాకే అవార్డులు వచ్చాయన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో మన జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. అవార్డులు రాని వారు, వచ్చిన వారి నుండి స్ఫూర్తి పొంది ఇంకా మెరుగ్గా పనిచేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో జెడ్పి ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూ, గతంతో పోలిస్తే ఇప్పుడు గ్రామాలు చాలా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సిబ్బందికి వేతనాలకు కష్టంగా ఉండేదని, ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీ లో ట్రాక్టర్, ట్యాoకర్, అన్ని మౌళిక సదుపాయాలతో పరిపుష్టంగా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ పల్లెలు గర్వించే విధంగా అభివృద్ధి చెందాయని, అవార్డులు రానివారు స్పూర్తితో మరింత ముందుకు సాగాలని, ఇంకా బాగా పనిచేయాలని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు చేసిన అత్యుత్తమ పనిని గుర్తించడానికి, పనిని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వంలోని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రతి సంవత్సరం అందజేస్తున్నట్లు తెలిపారు. పేదరికం లేని మెరుగైన జీవనోపాధి గల గ్రామం, ఆరోగ్యకరమైన గ్రామం, పిల్లల స్నేహపూర్వక గ్రామం, నీరు సరిపడా గల గ్రామం, స్వచ్ఛమైన పచ్చని గ్రామం, స్వయం సమృద్ధిగా మౌళిక సదుపాయాలు గల గ్రామం, సామాజికంగా సురక్షితమైన న్యాయమైన గ్రామం, సుపరిపాలన తో కూడిన గ్రామం, మహిళా స్నేహపూర్వక గ్రామం తదితర తొమ్మిది విభాగాల్లో మెరుగ్గా ఉన్న గ్రామాలను ఎంపిక చేసి, అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు.


కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, తెలంగాణ గ్రామాలు భారత దేశానికి రోల్ మోడళ్లుగా ఉండడం గర్వించదగ్గ విషయమని అన్నారు. సర్పంచులు గ్రామాభివృద్ధికి చాలా కృషి చేయాలన్నారు. గతం కంటే గ్రామాల్లో చైతన్యం పెరిగిందని, పల్లె ప్రగతితో చాలా మార్పు వచ్చిందని ఆయన అన్నారు. అవార్డు రానివారు, వచ్చిన వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు లో మెరుగ్గా రాణించాలని అన్నారు. 9 విభాగాల్లో జిల్లాకు చెందిన గ్రామ పంచాయతీలు నెంబర్ 1 స్థానంలో నిలవాలన్నారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, గతంలో సర్పంచులు ప్రజలతో ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు సర్పంచులు పొగడబడుతున్నారని అన్నారు. గ్రామాల్లో సిసి రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠదామాలు తదితర అన్ని సదుపాయాల కల్పన జరిగిందని
అన్నారు. ప్రజల సహకారం తో గ్రామాలు ప్లాస్టిక్ ఫ్రీ గ్రామాలుగా రూపుదిద్దుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను అభినందించి, ఘనంగా సత్కరించారు.


కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, జెడ్పి సిఇఓ అప్పారావు, జిల్లా అధికారులు, జెడ్పిటిసిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS