SAKSHITHA NEWS

ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలపై ఆంక్షలు విధించడం పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మంగళగిరిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి నెల మొదటి రోజు వాలంటీర్లు నేరుగా అవ్వతాతలకు పెన్షన్ ఇచ్చే సౌకర్యానికి చంద్రబాబు అడ్డు తగిలారన్నారు.

సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే సంస్థను ఏర్పాటు చేసి వాలంటీర్ల సేవలను నిలుపుదల చేశారన్నారు. దీనిని కేవలం ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలోనే స్థాపించారన్నారు. ఇందులో ఉన్నది చంద్రబాబు మనుషులే అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఇలా ఫిర్యాదు చేశారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా 34 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు కాదా.. కేవలం పెన్షన్లు ఇస్తేనే ప్రజలు ఓటేస్తారా అని ప్రశ్నించారు. పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆ ప్రభుత్వానికే ఓటు వేసేట్లయితే మొన్న వైసీపీకి అధికారం ఎలా వచ్చిందని అడిగారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఎవరు ప్రభావితం చేస్తున్నారని ప్రశ్నించారు.

టీడీపీ వాళ్లు అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే ఉత్తర్వులు ఇస్తున్నారని అరోపించారు. కూటమికి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఎలాగైనా వైపీపీ ప్రభుత్వం అందించే సేవలకు అడ్డు తగులుతున్నారన్నారు. ఎల్లో మీడియాల్లో వైసీపీ గురించి ఎన్ని వార్తలు రాసినా పట్టించుకోవడం లేదన్నారు. నారా భువనేశ్వరి మోడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్‎ను విస్మరిస్తుంటే ఎన్నికల సంఘం అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రచారంలో సైకిల్ బ్యాడ్జీని ధరించారని, కార్యకర్తలకు రూ. 3లక్షల చెక్కులను పంపిణీ చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. దీనిపై ఎన్నికల సంఘం అధికారులకు అర్జీ పెట్టామని ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇలాంటి ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ప్రజలు సీఎం జగన్ మోహన్ రెడ్డికే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఈరోజు ఇదే వాలంటీర్లపై సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. కేవలం ఎన్నికల కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ప్రజలకు గుర్తు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.

WhatsApp Image 2024 03 31 at 8.57.37 PM

SAKSHITHA NEWS