రైల్వే సమస్యలపై లేఖ
డోర్నకల్ – మిర్యాలగూడ లైన్ అలైన్మెంట్ మార్చాలి
మధిర లో ఆర్ యూబీ నిర్మించాలి
ఖమ్మం లో కేరళ, లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపాలి
నామ నాగేశ్వరరావు వినతులపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం జిల్లాకు సంబంధించి పెండింగులో ఉన్న వివిధ రైల్వే సమస్యల పరిష్కారానికి బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ నామ పలు రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి తీసికెళ్లారు. ప్రధానంగా ప్రతిపాదిత డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వే లైన్ అలైన్మెంట్ ను మార్చాలని కోరుతూ ప్రత్యేకించి లేఖ అందజేయగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఖమ్మం జిల్లాతో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించగా పరిశీలిస్తామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలోని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని నామ మంత్రికి వివరించారు.
అప్రోచ్ రోడ్లు కావాలి
అలాగే మధిర నుంచి డౌన్ లైన్ లో ఉన్న దెందుకూరు ప్రజలు రైల్వే లైన్ పక్కన అప్రోచ్ రోడ్డు లేక పడుతున్న ఇబ్బందులను నామ రైల్వే మంత్రి దృష్టికి తీసికెళ్లారు. దెందుకూరు గ్రామ రైతులు ఇప్పటి వరకు మూడు రైల్వే లైన్లకు అవసరమైన విలువైన భూములను త్యాగం చేశారని, ఇప్పుడు వారికి ట్రాక్ పక్కన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల తమ ఉత్పత్తుల రవాణా విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ నష్ట పోతున్నారని చెప్పారు. వారికి అవసరమైన చోట అప్రోచ్ రోడ్లను నిర్మించేలా ఆదేశాలు ఇవ్వాలని నామ రైల్వే మంత్రిని కోరారు. డౌన్ లైన్ లో 534 /21 నుంచి 535 / 22 కిలోమీటరు రాయి వరకు తొండలగోపారం వెళ్లే మార్గంలో ఒక కిలో మీటరు మేరకు అప్రోచ్ రోడ్డు వేయాలని కోరారు. అలాగే 534 నుంచి 533/2 వరకు వేస్తున్న అప్రోచ్ రోడ్డును 533/2 నుంచి 532/4 వరకు పొడిగించాలని మంత్రికి వివరించారు. అలాగే 534/ 5 నుంచి 538 వరకు మూడున్నర కిలోమీటర్ల మేర తొండల గోపారం మార్గంలో అప్రోచ్ రోడ్డును నిర్మించాలని దెందుకూరు రైతులు కోరుతున్నారని, వారి విజ్ఞప్తి ని మన్నించాలని నామ మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు.
అర్యూ బీ కి సానుకూలం
అలాగే మధిర రైల్వే గేట్ స్థానంలో ఆర్ యూ బీ నిర్మించేలా సత్వర చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. రైల్వే గేట్ వల్ల పట్టణ ప్రజలు, వ్యాపారులు, చుట్టు పక్కల ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గతంలో పలుమార్లు రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చిన సంగతిని నామ గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఆర్యూబీ ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తానన్న విషయాన్ని నామ ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసికెళ్లారు. 35 వేల జనాభా ఉన్న మధిర పట్టణంలోని ఈ రైల్వే గేట్ స్థానంలో ఆర్యూబీ నిర్మించేందుకు ఆదేశాలు ఇవ్వాలని నామ కోరగా తగు చర్యలు తీసుకుంటానని మంత్రి చెప్పారు.
కేరళ, లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపాలి
అలాగే 2 లక్షల జనాభా ఉన్న ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి వ్యాపారులతో సహా అన్ని వర్గాల ప్రజలు ఢిల్లీ, ముంబయి, తదితర పెద్ద నగరాలకు తరచూ ప్రయాణిస్తుంటారని, కేరళ ఎక్స్ ప్రెస్ (, టి. ఆర్. నెం. 12625- 12626 , త్రివేణి నుంచి న్యూఢిల్లీ వరకు) , లోకమాన్య తిలక్ టన్నెల్ ( టి. ఆర్. నెం.18519 – 18520 – విశాఖ నుంచి ముంబయి ) ఎక్స్ ప్రెస్ రైళ్లను ఖమ్మం రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని నామ నాగేశ్వరరావు రైల్వే మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు.