ఎంపీ కేశినేని నాని కృషి అభినందనీయం.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,
నాది…ఎంపీ కేశినేని నానిది ఒకటే మాట అని, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు అని, మిగతా సందర్భాలలో అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పని చేస్తామని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు.
ప్రజలకు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) కృషి అభినందనీయమన్నారు.
మైలవరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎంపీ కేశినేని నానితో కలసి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ 17 గ్రామాలకు సంబంధించిన తాగునీటి ట్యాంకర్లను (ట్రాక్టర్ల సాయంతో నడిచేవి) అందజేశారు. 5వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన ఒక్కో ట్యాంకర్ రూ.2.50 లక్షల వ్యయం కాగా మొత్తం రూ.42.50 లక్షల ఎంపీ నిధులను వెచ్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత నాలుగున్నర ఏళ్లలో తన హయాంలో మైలవరం నియోజవర్గ సమస్యలపై ఎంపీ కేశినేని నాని ఎప్పుడూ సామాజిక స్పృహతో స్పందిస్తూ అప్పట్లో వేరే పార్టీలో ఉన్నప్పటికీ, తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారని పేర్కొన్నారు.
ఎంపీ నిధుల నుండి తను కోరినట్లు రూ.1.80 కోట్ల నిధులు మంజూరు చేసి, పలు సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. ఎంపీ నానికి మైలవరం నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనికి నాని ని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా ఐకమత్యంగా కృషి చేస్తామన్నారు.
ట్యాంకర్లు అందజేసిన గ్రామాలు ఇవే.
మైలవరం మండలంలోని చంద్రాల, కనిమెర్ల తండా, కీర్తిరాయుని గూడెం, తోలుకోడు, సీతారాంపురం తండా, గణపవరం, మొర్సుమిల్లి, వెల్వడం, వెదురుబీడెం, ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ, కొటికలపూడి, ఈలప్రోలు, దాములూరు, కాచవరం, మూలపాడు, తుమ్మలపాలెం, గుంటుపల్లి గ్రామాలకు సంబంధించి ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు, కార్యదర్శులకు ట్యాంకర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.