కీర్తిరాయునిగూడెంలో రూ.40లక్షలతో సచివాలయం ప్రారంభం.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,
స్ధానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృషితో మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మైలవరం మండలం కీర్తిరాయునిగూడెంలో రూ.40లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మంగళవారం ప్రారంభించారు.
కీర్తిరాయునిగూడెంలో సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సభను నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. దివంగత మహానేత వైఎస్సార్ ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినదించారు.
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇక్కడ సచివాలయ భవనానికి స్థలం వితరణ గావించిన దాతలు మల్లాది సోమయ్య, దేవరకొండ సరోజినిలకు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి అభినందించారు. శాలువాలు కప్పి సత్కరించారు.
సీఎం జగనన్న సచివాలయాలు నిర్మిస్తూ ప్రభుత్వ సేవలను గ్రామాల్లో అందుబాటులోకి తెచ్చారని అన్నారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థతో కులం, మతం, వర్గ, రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. అభివృద్ధి పనుల్లో మైలవరం నియోజకవర్గం జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు.
రాష్ట్రప్రభుత్వం సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇవ్వబట్టే అభివృద్ధి పనులు అనగా ముఖ్యంగా రోడ్లు, డ్రెయిన్ల విషయంలో ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ భవిష్యత్తులో వాటన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.
గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అంతర్గత కలహాలు విడనాడి అందరూ ఐకమత్యంగా ఉండి ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి పేదకి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతోనే తను పనిచేసినట్లు వెల్లడించారు.
స్థానిక వైసీపీ నాయకులు, దివంగత డీలర్ రాజా సేవలను స్మరించారు. డీలర్ రాజా ఇప్పుడు మనమధ్య లేకపోవడం పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులు చేపట్టిన చంద్రాల సొసైటీ అధ్యక్షులు బెజవాడ నాగమల్లేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు. మిగిలిన అభివృద్ధి పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు. అధికారులు కూడా బిల్లులు చేసే విషయంలో జాప్యం చేయవద్దని ఆదేశించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం నాయకులు, కార్యకర్తలు అందరూ ఎంతో కష్టపడ్డారని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.