ప్రధాని మోడీ వ్యాఖ్యలపై దీటుగా స్పందించిన ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ : దేశం కోసం మా అమ్మ మంగళ సూత్రాన్నే త్యాగం చేసిందంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. కర్ణాటక రాజధాని బెంగళూ రులో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడుతూ.. ”గత రెండు రోజులుగా కాంగ్రెస్ వాళ్లు మీ మంగళసూత్రం, బంగారం లాక్కోవాలనుకుంటున్నారని బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయ్యింది, 55 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఎవరైనా బంగారం లాక్కున్నారా? మీ మంగళ సూత్రాన్ని గుంజుకున్నారా? దేశంలో యుద్ధం జరిగినప్పుడు, ఇందిరా గాంధీ తన బంగారాన్ని దేశానికి అందించారు. ఈ దేశం కోసం నా తల్లి మంగళసూత్రాన్ని (రాజీవ్ గాంధీని) త్యాగం చేశారు.” అని అన్నారు.
”మంగళసూత్రం’ ప్రాముఖ్యతను మోడీజీ అర్థం చేసుకుని ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడేవారు కాదు.. నోట్ల రద్దు జరిగినప్పుడు మహిళల పొదుపు సొమ్మును ఎత్తుకెళ్లారు.. రైతుల నిరసనలో 600 మంది రైతుల ప్రాణాలు బలిగొన్నారు. ఆ రైతుల ఇల్లాలి ‘మంగళసూత్రం’ గురించి ఆలోచించాడా? మణిపూర్‌లో మహిళను వివస్త్రగా ఊరేగించినప్పుడు, ఆమె ‘మంగళసూత్రం’ గురించి ఆయన ఆలోచించాడా? ఈరోజు మహిళలను భయపెట్టడానికి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. వారు భయపడి ఓటు వేస్తారని భావిస్తున్నాడు” అని అన్నారు. సత్య మార్గంలో నడవడం, ఇతరులకు సేవ చేయాలనే స్ఫూర్తితో దేశానికి సేవ చేయడం హిందూ సంప్రదాయంతోపాటు రాజకీయ సంప్రదాయమని ప్రియాంక అన్నారు. పార్టీలకు అతీతంగా గత ప్రధానమంత్రులందరూ దేశ ప్రజల కోసం అంకితభావంతో పనిచేశారు. అయితే నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అబద్ధాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రభుత్వాలను పడగొట్టడానికి ప్రజాస్వామ్య విలువలన్నింటినీ తుంగలో తొక్కిన బిజెపిని ఖండించే సాహసం ఎవరూ చేయడం లేదు అని తెలిపారు.
నైతికతను వదులుకుని నాటకాలు..
దేశంలోనే అతిపెద్ద నాయకుడు నైతికతను వదులుకున్నారని, ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నారని, సత్య మార్గాన్ని అనుసరించడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం, వారి బ్యాంకు ఖాతాలు జప్తు చేయడం, ఇద్దరు ముఖ్యమంత్రులను జైల్లో పెట్టడం ద్వారా విపక్షాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ‘సూపర్ మ్యాన్’ చిత్రం చూశానని అయితే ‘మెహంగైమాన్’ వచ్చిందని ప్రియాంక అన్నా రు. ఈ పదేళ్లలో ప్రభుత్వం ప్రజల కోసం ఏ పనీ చేయలేదన్నది నిజమని చెప్పారు.
‘మోడీ అంత గొప్ప నాయకుడైతే..
‘ఉపాధి, విద్య, ఆరోగ్య సౌకర్యాల గురించి బిజెపి నాయకులు ఎప్పుడూ మాట్లాడరు, కానీ వారు కేవలం ఆవేశపూరితమైన, దారి మళ్లించే అంశాలపై మాత్రమే మాట్లాడుతున్నారు. మోడీ ప్రపంచంలోనే గొప్ప నాయకుడని అంటున్నారు. ఇంతటి పలుకుబడి, కీర్తి, అహంకారంతో మోడీ ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఒక్క క్షణంలో ఆపగలరని అంటారు. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అతను (మోడీ) అంత పెద్ద నాయకుడైతే, అతన్ని ఎవరూ ప్రశ్నించలేనంత ప్రభావం ఆయనకు ఉంటే, అతను మీకు ఉపాధి కల్పించడంలో ఎందుకు విఫలమయ్యాడు, ద్రవ్యోల్బణం ఎందుకు తగ్గించలేకపోయాడు. యువత కోసం కొత్త పథకం ఎందుకు తీసుకురాలేదు, మీ కుటుంబాల్లో ఎందుకు అభివృద్ధి జరగలేదు?’ అని సూటిగా ప్రశ్నించారు.