రైల్వే లైన్ ప్రతిపాదనలు వల్ల 11 గ్రామాలు ప్రభావితం
అలైన్మెంట్ మార్చాలని బాధిత గ్రామాల తీర్మానం
ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రికి ఆయా గ్రామాలు తీర్మానాలు, ఫిర్యాదులు
కేంద్ర రైల్వే మంత్రికి, జీఎం కు, ఉన్నతాధికారులకు బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు లేఖలు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
దక్షిణ మధ్య రైల్వే డోర్నకల్ -మిర్యాలగూడ మధ్య కొత్తగా నిర్మించతలపెట్టిన రైల్వే లైన్ అలైన్‌మెంట్‌లో ప్రజా ప్రయోజనాల రీత్యా తక్షణమే మార్పులు చేయాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్ర రైల్వే మంత్రిని, రైల్వే జనరల్ మేనేజర్ ను, ఇతర ఉన్నతాధికారులను కోరారు. ఈ మేరకు ఆయన వేర్వేరుగా వారికి లేఖలు రాశారు. ఖమ్మం జిల్లాల్లోని ప్రభావిత గ్రామ పంచాయతీల నుండి అందిన తీర్మానాలు, ఆయా గ్రామాల కు చెందిన వివిధ పార్టీల నాయకుల నుండి అందిన ప్రాతినిధ్యాలను పరిగణలోకి తీసుకుని , ఈ లేఖలు రాసినట్లు నామ నాగేశ్వరరావు తెలిపారు. డోర్నకల్ – మిర్యాలగూడ కొత్త రైల్వే లైన్ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల మీదుగా ఈ కొత్త రైల్వే లైన్ వెళుతోందని చెప్పారు. తద్వారా ఉత్పన్నమవుతున్న అనేక సమస్యలను ప్రత్యేకించి రాస్తున్న ఈ లేఖల ద్వారా కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసికెళ్లినట్లు చెప్పాను. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల, చిన్న వెంకటగిరి, గోళ్ళపాడు, ముత్తగూడెం, తెల్దారుపల్లి, పల్లెగూడెం, గుర్రాలపాడు, పోలేపల్లి, మద్దులపల్లి, ఏదులాపురం తదితర గ్రామ పంచాయతీల మీదుగా ఈ కొత్త రైల్వే లైన్ వేస్తున్నారని అన్నారు. రైతుల పొలాలు, ఇంటి స్థలాలు
, ఇళ్ళు, సాధారణ ప్రజలకు కాకుండా విలువైన భూముల మీదుగా ఈ రైల్వే లైన్ వెళ్లడం వల్ల ప్రజలకు, సన్న, చిన్న కారు రైతులకు, సామాన్య పేద ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని నామ లేఖలో పేర్కొన్నారు. వాస్తవ కారణాల ఆధారంగా ప్రజలు లేవనెత్తిన ఆందోళనల ఆధారంగా ఈ లైన్ యొక్క అలైన్మెంట్ మార్చాలని సూచించారు.
ప్రతిపాదిత లైను తన నియోజక వర్గంలో సుమారుగా 1.4 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం , నేలకొండపల్లి మండలంలోని వివిధ గ్రామాల మీదుగా, అంటే ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో నుంచి ఈ రైలు మార్గం ప్రతిపాదించారని అన్నారు. ఈ కొత్త రైలు మార్గం వల్ల గోళ్లపాడు, పోలేపల్లి, పల్లెగూడెం, రెడ్డిపల్లి, ఏదులాపురం, ముత్తగూడెం, మద్దులపల్లి, గుర్రాలపాడు, తీర్థాల, చిన్న వెంకటగిరి, తెల్దారుపల్లి తదితర గ్రామాలు ప్రభావితమయ్యాయని చెప్పారు. ఖమ్మం రూరల్ మండల గ్రామాలు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని, ఇప్పటికే హౌసింగ్ లే అవుట్లు , వెంచర్లలో ప్రజలు కొనుగోలు చేసిన వందలాది ఎకరాల వ్యవసాయ భూమి, ఇంటి స్థలాలు గత దశాబ్దంలో అభివృద్ధి చేయబడ్డాయని తెలిపారు. ధరణి నగర్, లక్ష్మీ గాయత్రి నగర్, నందనవనం, వెంకటేశ్వర నగర్, ఏదులాపురం గ్రామం, ఆదిత్య నగర్-1, ఆదిత్య నగర్-ll వంటి గేటెడ్ కమ్యూనిటీలు. వెంకటాద్రి నగర్-ఎల్, ఏదులాపురం గ్రామాలు గత 3 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చేయబడ్డాయని నామ కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఫలితంగా ఈ ప్రాంతంలో చదరపు గజం భూమి విలువ రూ. 30 వేలు, అంతకంటే ఎక్కువగానే ఉందన్నారు. వ్యవసాయ భూమి విలువ దాదాపు ఎకరాకు రూ.6 కోట్లు పలుకుతుందన్నారు. అందువల్ల భూముల వాస్తవ విలువలు మార్కెట్ విలువల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని లేఖలో వివరించారు. వ్యవసాయ పొలాలు , ఖరీదైన నివాస ప్రాంతాలు, ఇళ్ళు, విలువైన ప్లాట్లల్లో నుంచి ఈ కొత్త రైలు మార్గాన్ని ప్రతిపాదించడం వల్ల తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. అంతేకాకుండా భూ సేకరణకు పరిహారం చెల్లింపునకు సంబంధించి కూడా ప్రభుత్వంపై అధిక భారం పడుతుందని పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలానికి చెందిన రైతులు ఇప్పటికే తమ విలువైన భూములను నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మేజర్ ఎడమ కాలువకు , వరంగల్ నుండి ఖమ్మం బైపాస్ రోడ్డు, కోదాడ నుండి కొరివి బైపాస్ రోడ్డు వంటి రహదారుల అభివృద్ధికి త్యాగం చేశారని గుర్తు చేశారు. ఇటీవల ప్రకటించిన నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు కూడా ఈ గ్రామాల భూములను తీసుకుందన్నారు.
అత్యంత విలువైన ప్రాంతాల గుండా కొత్త లైన్ వేయడం ఏ విధంగానూ అంత శాస్త్రీయంగా ఉండకపోవచ్చు నన్నారు. అనేక రహదారి మార్గాల ద్వారా క్రాసింగ్, వంతెనల నిర్మాణం వల్ల కూడా ప్రభుత్వానికి పెనుభారం అవుతుందని నామ రైల్వే మంత్రి కి విన్నవించారు.
11 ప్రభావిత గ్రామ పంచాయతీలకు చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు రైల్వే లైన్ అలైన్మెంట్ మార్పు కోరుతూ తీర్మానాలను ఆమోదించారని,ఫిర్యాదులు తో సహా వాటిని రైల్వే మంత్రికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రారంభ దశలో ఉన్న ఈ ప్రతిపాదిత రైలు లైన్‌లో అమరికను మార్చాలని నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .రైతుల మనుగడ కోసం వాస్తవాలను పరిగణలోకి తీసుకుని రైల్వే లైన్ సర్వేపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, ప్రతిపాదిత డోర్నకల్-మిర్యాలగూడ లైను అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను సిద్ధం చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర రైల్వే మంత్రిని కోరారు.
నామకు కృతజ్ఞతలు
డోర్నకల్ – మిర్యాలగూడ కొత్త రైల్వే మార్గం వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలను కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసికెళ్లిన నామ నాగేశ్వరరావుకు ఖమ్మం రూరల్, నేలకొండపల్లి , తదితర మండలాలకు చెందిన బాధిత గ్రామాల ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, పేదలు కృతజ్ఞతలు తెలిపారు. సమస్య పరిస్కారం కోసం నామ ముందుండి పోరాడుతున్నారని పేర్కొంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.