
సర్వేతో ప్రవాసులకు మరిన్ని సంక్షేమ పథకాలు
◉ ఉత్సాహంగా… నిర్భయంగా వివరాలు ఇవ్వాలి
గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కుటుంబ సభ్యులు ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో ఉత్సాహంగా పాల్గొనాలని, నిర్భయంగా వివరాలు ఇవ్వాలని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. గాంధీ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ లతో కలిసి వినోద్ మీడియాతో మాట్లాడారు.
సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేపై బీఆర్ఎస్, బీజేపీ లు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ప్రవాసీ కుటుంబాలను కోరారు. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలకు మరిన్ని సంక్షేమ పథకాలు రూపకల్పన చేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని డా. వినోద్ అన్నారు. కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి తడితరులు పాల్గొన్నారు.
