SAKSHITHA NEWS

More quality and delicious Annaprasads for the devotees who come for the darshan of Tirumala Shrivari

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం కార్యకలాపాలను బుధవారం ఈవో రివ్యూ చేశారు. టీటీడీలోని ప్రతి విభాగం పని తీరుపై తెలుసుకోవడంలో భాగంగా తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మంలతో కలిసి అన్నప్రసాద విభాగాన్ని సంబంధిత అధికారులతో కలసి ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు.

తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌(ఎంటీవీఏసీ), విక్యూసీలోని అక్షయ కిచెన్‌, పీఏసీ 2తో పాటు, ఉద్యోగుల క్యాంటీన్‌, పద్మావతి అతిథి గృహం సహా తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే ప్రదేశాలను ఆయన సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి, తాత్కాలికంగా నిలిపివేసిన పాంచజన్యం వంటశాలను త్వరగా ప్రారంభించేలా చూడాలని అన్నప్రసాదం, ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.

తిరుమల, తిరుపతిలతో కలిపి రోజుకు సగటున 1.92 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. వీరిలో తిరుమలలో అన్నం తినేవారి సంఖ్య దాదాపు 1.75లక్షలు కాగా, తిరుపతిలో 17వేలు మందిగా ఉంది. వారాంతాల్లో తిరుమలలో 1.95 లక్షలు, తిరుపతిలో 19 వేలతో కలిపి సుమారు 2.14 లక్షల మందికి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. కాగా ఒక రోజున అన్నప్రసాదం కోసం అవుతున్న ఖర్చు దాదాపు రూ.38 లక్షలుగా ఉంది.

కాగా భక్తులకు అందజేస్తున్న మజ్జిగలో నాణ్యత పెంచాలని, వంట చేసే స్థలంలో ఆవరణను పరిశుభ్రంగా, పొడిగా ఉంచాలని అధికారులకు ఈఓ సూచించారు. ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఫుడ్ క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు.

తిరుమల, తిరుపతిలలో పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచడం, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దశాబ్దాల నాటి యంత్రాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం, అన్నప్రసాదం నాణ్యతను పెంచేందుకు ఫుడ్‌ కన్సల్టెంట్‌ను నియమించడం వంటి అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా అమలు చేసేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని సంబంధిత అధికారులను ఈఓ ఆదేశించారు

WhatsApp Image 2024 06 20 at 14.07.28

SAKSHITHA NEWS