కొలంబియా నుంచి ఇండియాకు చేరిన బేతపూడి సుధీర్ కుమార్ మృతదేహం.
ఎన్టీఆర్ జిల్లా,
ఫలించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృషి
కొలంబియా నుంచి ఇండియాకు చేరిన బేతపూడి సుధీర్ కుమార్ మృతదేహం.
నేడు జి.కొండూరులో అంత్యక్రియలు.
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కృషి ఎట్టకేలకు ఫలించింది. కొలంబియా నుంచి ఇండియాకు బేతపూడి సుధీర్ కుమార్ మృతదేహం చేరింది. భౌతికకాయం తరలింపుకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృషితో ఏపీ ఎన్.ఆర్.టి ప్రత్యేక చొరవ చూపింది. బాధిత కుటుంబానికి ఆర్ధిక ఊరట లభించింది.మరణించిన 21 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత తల్లిదండ్రులకు కుమారుని చివరిచూపు లభించింది. నేడు జి.కొండూరులో సుధీర్ కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన బేతపూడి దేవదాసు మాస్టారు కుమారుడు సుధీర్ కుమార్ (34) ఉన్నత చదువుల కోసం స్పెయిన్ వెళ్ళాడు. అక్కడినుంచి కొలంబియా వెళ్లి అనుమానాస్పద రీతిలో సెప్టెంబర్ 19న మృతిచెందాడు. మృతికి కారణాలు ఏమైనప్పటికీ కడసారి ఆఖరి చూపుకు సుధీర్ కుమార్ భౌతికకాయం ఇండియాకు రప్పించాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది. కాగా ఇందుకు 10వేల అమెరికన్ డాలర్లు (సుమారు రూ.8.3లక్షలు) ఖర్చు అవుతుందని అంచనా వేయడంతో పేద కుటుంబం తల్లడిల్లింది.
చేతికి వచ్చిన కుమారుడు మృతిచెందండంతో పాటు మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు కూడా లక్షల్లో ఖర్చు అవుతుందని, అంత సొమ్ము భరించలేక బాధిత కుటుంబం నిస్సహాయ స్థితిలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వారి దీనస్థితిని రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు (APNRT) సొసైటీ ద్వారా కొలంబియాలోని ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరిపారు. బేతపూడి సుధీర్ కుమార్ భౌతికకాయం ఇండియాకు తరలించడానికి న్యాయపరమైన చిక్కులన్నీ లేకుండా చేశారు.
కొలంబియా రాజధాని బోగోట నుంచి ఇండియాలోని చెన్నైకు కార్గో విమానంలో భౌతికకాయాన్ని తరలించారు. దీనికి సంబంధించిన సొమ్మును ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చూపిన చొరవతో రాష్ట్రప్రభుత్వం భరించింది. చెన్నై నుంచి కూడా ప్రత్యేక వాహనంలో విజయవాడకు సమీపంలోని జి.కొండూరుకు బేతపూడి సుధీర్ కుమార్ మృతదేహాన్ని తరలించారు. నేడు జి.కొండూరులో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఎట్టకేలకు బాధిత కుటుంబానికి సుధీర్ కుమార్ చివరిచూపు లభించింది.