గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా ప్రభుత్వం వారు జరిపిన భూసేకరణలో గన్నవరం మండలం బుద్ధవరం, దావాజిగూడెం, అల్లాపురం గ్రామాలలోని హరిజనవాడలకు చెందిన 484 మంది తమతమ నివాసాలను కోల్పోయినారు. భూసేకరణ సమయంలో వారికి ఆర్&ఆర్ ప్యాకేజీ క్రింద నివాసస్థలాల కేటాయింపు, ఉచిత గృహనిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు అధికారులు, అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చియున్నారు. కాగా, ఆర్&ఆర్ ప్యాకేజీ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. ఆర్&ఆర్ ప్యాకేజీ క్రింద నివాసస్థలాలను కేటాయించుటకుగాను చిన్న అవుటపల్లి గ్రామపంచాయితీ పరిధిలో భూసేకరణ జరిపి 250 గజాల విస్తీర్ణం కలిగిన 484 ప్లాట్లతో లేఅవుట్ ను అధికారులు రూపొందించియున్నారు. అచ్చట 484 మందికి నివాసస్థలాలు కేటాయించియున్నారు. కానీ ఆయా ప్లాట్లను ఇప్పటివరకు నిర్వాసితుల పేరిట రిజిస్ట్రేషన్ చేయలేదు.
కాగా, ఆయా నిర్వాసితుల పక్షాన ఆదినుండి నిలబడి పోరాడుతున్న గన్నవరం ఎమ్మెల్యే డా.వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తో అనేక పర్యాయాలు మాట్లాడి ఆయా నిర్వాసితుల పేరిట ఆయా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించియున్నారు. ఆయా రిజిస్ట్రేషన్ పత్రాలను గన్నవరం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణమండపం నందు జరిగిన కార్యక్రమంలో ఆయా నిర్వాసితులకు పంపిణీ చేసియున్నారు. త్వరలోనే ఆయా స్థలాలలో ఇళ్ళు నిర్మించుకోవడానికి గృహ నిర్మాణ రుణాలను మంజూరు చేయిస్తానని, మౌలికసదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వంశీ తెలిపారు.