Minister Thalasani Srinivas said that mega dairy construction works should be accelerated
సాక్షిత : మెగా డెయిరీ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో డెయిరీ నూతన చైర్మన్ సోమ భరత్ కుమాతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, విజయ డెయిరీ ఇంచార్జి MD ఆధార్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, TSLDA CEO మంజువాణి లు పాల్గొన్నారు. ముందుగా డెయిరీ కి నూతనంగా చైర్మన్ గా నియమితులైన సోమ భరత్ కుమార్ ను శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మంత్రి పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, డెయిరీ ల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. విజయ డెయిరీ అభివృద్ధి లో భాగంగా సుమారు 250 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరిజ్ఞానంతో 5 లక్షల లీటర్ల సామర్ధ్యం తో రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద మెగా డెయిరీ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉన్నదని, వాటిని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పెద్ద ఎత్తున ఔట్ లెట్ లను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు నష్టాలలో ఉన్న విజయ డెయిరీ ని తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 700 కోట్ల రూపాయల టర్నోవర్ కు చేరుకుందని వివరించారు.
దీనిని వెయ్యి కోట్లకు చేరుకోవాలని లక్ష్యంగా విజయ డెయిరీని మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఇంకా మరిన్ని నూతన విజయ ఔట్ లెట్ లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు.
విజయ ఉత్పత్తుల విక్రయాల పెరుగుదలకు అనుగుణంగా ఉత్పత్తి చేసేందుకు మెగా డెయిరీ ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా విజయ డెయిరీ కి పాలు పోసే రైతులకు ప్రభుత్వ పరంగా అనేక విధాలుగా చేయూతను అందిస్తున్నదని, ఈ విషయాన్ని రైతులకు వివరించి విజయ డెయిరీ కి పాలు పోసే విధంగా ప్రోత్సహించాలని అన్నారు.
పాల సేకరణ పెరిగే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తి మన రాష్ట్రంలోనే జరిగేందుకు అధిక పాలను ఇచ్చే నాణ్యమైన పాడి పశువుల ఉత్పత్తి కోసం పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ల సహకారంతో గ్రామాలలో కృత్రిమ గర్భధారణ శిభిరాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గోపాలమిత్రల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.