SAKSHITHA NEWS

సాక్షిత : సెంట్రల్ హైదరాబాద్ లోని విఎస్టీ – ఇందిరా పార్క్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఇతర పనులను మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టీల్ బ్రిడ్జ్ పురోగతిని జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. స్టీల్ బ్రిడ్జ్ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మూడు నెలలలోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలలో నగర ట్రాఫిక్ పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మూడు నెలల్లోగా నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేసి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వర్కింగ్ ఏజెన్సీని కేటీఆర్ ఆదేశించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అటు కార్మికులకు, నగర పౌరులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలను కూడా తీసుకోవాలని సూచించారు.

స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం [ఎస్.ఎన్.డి.పి]లో భాగంగా అశోక్ నగర్ వద్ద కొనసాగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలా లో చేపడుతున్న పనులను సమీక్షించారు. వర్షాకాలం ప్రారంభం నాటికి ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా స్థానిక ఎమ్మెల్యే మరియు ఇతర ప్రజా ప్రతినిధుల సహకారంతో వేగంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మంత్రి జిహెచ్ఎంసి అధికారులకు సూచించారు.


SAKSHITHA NEWS