సీఎం కెసిఆర్ చిత్ర పటానికి సెర్ప్ ఉద్యోగులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలాభిషేకం
కొత్త పే స్కేల్ తో సెర్ప్ ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు
సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లిలకు కృతజ్ఞతలు
సాక్షిత హైదరాబాద్, :
సవరించిన కొత్త స్కేల్ జీవో జారీ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు నింపింది. ఆ సంస్థ ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా మంత్రులను కలుస్తూ, వారిని సన్మానిస్తూ, సీట్లు పంచుతూ, తమ సంతోషాన్ని, కృతజ్ఞతలను పంచుకుంటున్నారు. వారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని, హైదారాబాద్ లోని మంత్రుల నివాసంలో కలిశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి సెర్ప్ ఉద్యోగులతో కలిసి సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, కొత్త పే స్కేల్ ఇవ్వడం సిఎం కెసిఆర్ ఉదారతకు నిదర్శనమన్నారు. హేతుబద్ధంగా పని చేయడం సిఎం కెసిఆర్ నైజమని చెప్పారు. ఓపికతో ఉన్న వారికి తప్పకుండా కెసిఆర్ న్యాయం చేస్తారనడానికి సెర్ప్ ఉద్యోగులకు పే స్కేలే నిదర్శనమన్నారు. 25 ఏండ్లుగా ఎదురు చూస్తున్న సెర్ప్ ఉద్యోగులకు ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా వేతనాలు పెంచారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి సిఎం కెసిఆర్ కి, మంత్రులు కెటిఆర్, హరీశ్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, మంత్రి ఎర్రబెల్లిని సెర్ప్ ఉద్యోగులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగుల సంఘం నేతలు సుదర్శన్, వెంకట్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.