హైదరాబాద్: ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో వెల్లడించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పలు ప్రశ్నలు లేవనెత్తారు. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారని.. 30 మోసాలు, 60 అబద్ధాలు చెప్పించారన్నారు. ఈ విమర్శలను మంత్రులు తిప్పికొట్టారు.
చట్టసభల్లో అబద్ధాలు చెప్పడం తీవ్ర నేరం: పల్లా
ప్రజాభవన్‌కు వచ్చేవారి ఫిర్యాదులు తీసుకునేందుకు ఎవరూ లేరని.. ఇప్పటివరకు ఎవరి సమస్యలనైనా పరిష్కరించారా?అని పల్లా ప్రశ్నించారు. చట్టసభల్లో అబద్ధాలు చెప్పడం తీవ్ర నేరమన్నారు. ‘‘ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరికైనా రూ.10 లక్షలు ఇస్తున్నారా? 13 హామీలిచ్చి రెండు పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపడా లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మహాలక్ష్మి పథకం ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టం ఇవ్వాలి. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెంచాలి. గత ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది. పదేళ్లలో 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. అదానీ ఇక్కడకు వస్తే తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది’’ అని చెప్పారు.
సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తాం
దీనికి మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ.. చిన్నచిన్న సమస్యలు వస్తాయనే మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అభయమిచ్చిందన్నారు. ఏడాదికి రూ.12 వేలు అందజేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. ఈ మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వచ్చే బడ్జెట్లో దీనిని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో ఎలాంటి భేషజాలు లేవు. అభివృద్ధి అనేది నిత్యం కొనసాగుతుంది. అందరికీ అవకాశం ఇవ్వాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం. ఒకరిద్దరికే అవకాశం ఇవ్వొద్దని రాహుల్ గాంధీ చెప్పారు. పెట్టుబడుదారులను రాష్ట్రానికి స్వాగతిస్తాం. తెలంగాణ అభివృద్ధిపై సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తాం. రాజకీయాలు వదిలి రాష్ట్ర ప్రగతిపై మాట్లాడదాం’’ అని హితవు పలికారు.
పదేళ్లలో నెలకు రూ.వెయ్యి ఇచ్చారా?
ఉచిత బస్సు టికెట్లకు తమ ప్రభుత్వం రూ.530 కోట్లను ఇచ్చినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘‘మీరు ఎప్పుడైనా ఆటో డ్రైవర్లకు సాయం చేశారా?పదేళ్లలో నెలకు రూ.వెయ్యి ఇచ్చారా? సభను తప్పుదోవ పట్టించేలా భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతున్నారు’’ అని మండిపడ్డారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? చెప్పాలని భారాస ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రశ్నించారు. ‘‘మహిళలు బస్సుల్లో ఉచితంగా తిరిగితే మీకేంటి సమస్య? భావోద్వేగాలు రెచ్చగొట్టడమే మీ నైజం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బస్సులు పెంచాలి: సునీతా లక్ష్మారెడ్డి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని భారాస స్వాగతిస్తోందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. బస్సు ట్రిప్పులు తగ్గించడం వల్ల మహిళలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. బస్సులు పెంచి.. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.