జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత సమయంలో సాధించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో హరితహారం, గృహలక్ష్మీ, బి.సి, మైనారిటీలకు ఆర్థిక చేయూత, రెండో విడత దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక తదితర పథకాల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ నెల 26న చేపట్టనున్న మాస్ హారితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణాలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లాకు కేటాయించిన లక్ష్య సాధనకు కార్యచరణ చేపట్టాలన్నారు. గృహలక్ష్మీ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అర్హుల జాబితాను రూపొందించాలన్నారు.
బి.సి, మైనారిటీలకు ఆర్దిక చేయూత పథకాన్ని అమలుకు కార్యచరణ చేయాలన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీ క్రింద మంజూరైన యూనిట్ల సేకరణ వేగవంతం చేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు. దళిత బందు పథకం కింద నియోజకవర్గానికి 11 వందలమంది లబ్ధిదారుల ఎంపికలో నివాస ధ్రువీకరణ, ఆధార్ కార్డు వివరాలను పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పి సిఇఓ వి.వి.అప్పారావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిణి విద్యా చందన, పశుసంవర్ధక జాయింట్ డైరెక్టర్ వేణుమనోహర్, ఈ.డి. ఎస్.సి. కార్పొరేషన్ నవీన్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి జ్యోతి, జిల్లా వెల్ఫేర్ అధికారి సుమ, డి.ఆర్.డి.ఏ. ఏ.పి.డి శిరీష, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మదన్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.