సీక్రెట్ భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్న మెటా అధినేత
స్వయంగా విద్యుత్, ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునేలా నిర్మాణం
నిర్మాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కార్మికులను తొలగించిన జుకర్ బర్గ్
ఒప్పందాలు కుదుర్చుకొని సీక్రెట్‌గా పనులు చేయిస్తున్న ఫేస్‌బక్ వ్యవస్థాపకుడు
హవాయి ద్వీపాల్లోని మారుమూల ద్వీపమైన కవాయిలో ఫేస్బుక్ మాతృసంస్థ మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ సీక్రెట్ బంకర్‌ను నిర్మిస్తున్నారా?. ఇందుకోసం ఏకంగా 260 మిలియన్ డాలర్లు(సుమారు రూ.2100 కోట్లు) వెచ్చిస్తున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. మార్క్ జుకర్‌బర్గ్ ఒక భారీ భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్నారని న్యూస్‌డాట్‌కామ్‌ఏయూ (news.com.au) కథనం పేర్కొంది. 2014లో కొనుగోలు చేసిన లగ్జరీ ఎస్టేట్‌లో దీనిని నిర్మిస్తున్నారని తెలిపింది. అత్యంత దుర్భేద్యంగా ఉండేలా దాదాపు దశాబ్దకాలంగా ఈ బంకర్ నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారని వివరించింది. 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్నారని పేర్కొంది. ఈ బంకర్‌కు స్వయంగా విద్యుత్, ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉందని వివరించింది. ఇందుకోసం ఏకంగా 260 మిలియన్ డాలర్లను ఖర్చుపెడుతున్నారని కథనం పేర్కొంది. ఈ బంకర్ నిర్మాణానికి సంబంధించి జుకర్‌బర్గ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
బంకర్ నిర్మాణం గురించి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన నిర్మాణ కార్మికులను పనిలో నుంచి తీసేసినట్టు ‘వైర్డ్’ కథనం పేర్కొంది. అక్కడ పనిచేస్తున్న కొందరు వ్యక్తులను సంప్రదించగా ఈ విషయం తెలిసిందని వెల్లడించింది. నిర్మాణానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయవద్దంటూ ఒప్పందాలు కుదుర్చుకొని పనిలోకి తీసుకున్నారని, నిర్మాణ ప్రదేశంలో ఫొటో కూడా తీసే పరిస్థితిలేదని ఓ కార్మికుడి చెప్పినట్టుగా ‘వైర్డ్’ కథనం ఊటంకించింది. కాగా మార్క్ జుకర్ బర్గ్ 2014లో కొనుగోలు చేసిన ఎస్టేట్లలో కావాయి ఎస్టేట్ ఒకటిగా ఉంది. 2016లో క్రిస్మస్ వేడుకలను ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో కూడా పంచుకున్న విషయం తెలిసిందే.
ఈ ఎస్టేట్ 1,400 ఎకరాల్లో విస్తరించింది. ఇక కావాయి ద్వీపంలో 73,000 మంది జనాభా నివసిస్తున్నారు. హాలీవుడ్ బ్లాక్ బాస్టర్ సినిమాలు ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’, ‘జురాసిక్ పార్క్’ సినిమాలను ఇక్కడే తెరకెక్కించడం గమనార్హం. 19వ శతాబ్దం చివరలో చెరకు సాగు కోసం వలస వచ్చిన చైనీస్, ప్యూర్టోరికన్, ఫిలిప్పైన్ వలసదారులు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారని ‘న్యూయార్క్ పోస్ట్’ కథనం పేర్కొంది.