SAKSHITHA NEWS

సాక్షిత జగిత్యాల జిల్లా :
మల్లాపూర్ తమకు కనీస మౌలిక వసతులు లేవని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మోడల్ స్కూల్ విద్యార్థినులు రోడ్డెక్కారు.

వర్షా కాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తమ స్కూల్లో కనీసం దగ్గు, జలుబు, జ్వరానికి కూడా మందులు అందుబాటులో లేవని తెలిపారు. స్కూల్లో కేర్ టేకర్, ఏఎన్ఎంలు లేరని ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే ఎవ్వరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

గత వారం రోజులుగా ఉన్న వార్డెన్ మేడం కూడా సెలవు పెట్టి వెళ్లిందని రాత్రి వేళ భయంతో బిక్కబిక్కుమంటూ గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, తమ సమస్యలను లెటర్ ద్వారా కలెక్టర్ కు వివరించినప్పటికీ కనీసం స్పందన లేదని విద్యార్థినులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్సై నవీన్ కుమార్ విద్యార్థినిలతో మాట్లాడారు.

వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. విద్యార్థినుల ఆందోళన పట్ల స్పందించిన జిల్లా విద్యాధికారులు హుటాహుటిన నలుగురు ఆశ వర్కర్లను సంబంధిత పాఠశాలకు పంపించినట్లుగా సమాచారం.

ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థినులు వేడుకుంటున్నారు…


SAKSHITHA NEWS