Live Sankranti art for Budumuru Santa
బుడుమూరు సంతకు సంక్రాంతి కళ
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని బుడుమూరు సంతకు సంక్రాంతి కళ వచ్చింది.చుట్టు పక్క గ్రామాల నుంచి రైతులు ఇక్కడికి చేరుకుని కూరగాయలు,ఇతర పండ్ల ఉత్పత్తుల విక్రయాలు సాగించారు.గ్రామీణ ప్రజలకు జీవనాధారం అయిన వ్యవసాయపు పనులు ముగిసి పంట చేతికి వచ్చిన వేళ అంతా ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ సిద్ధం అవుతున్నారు.ఈ క్రమంలో పల్లెలన్నీ ముస్తాబవుతున్నాయి.చిన్న చిన్న సంతలకు గిరాకీ కూడా పెరుగుతోంది.
ఇక్కడికి మహిళలు చేరుకుని క్రయ విక్రయాల్లో భాగంగా సందడి చేస్తున్నారు.పల్లె వాసుల సందడితో ఇక్కడ పండగ వాతావరణం నెలకొని ఉంది.అదేవిధంగా నూతన వస్త్రాల కొనుగోలుకు,కిరాణా సామాగ్రి కొనుగోలుకు కూడా పల్లె వాసులు ప్రాధాన్యం ఇస్తున్నారు.ఏడాది ఆరంభంలో పెద్ద పండుగగా చెప్పుకునే సంక్రాంతి వేళ చిన్న చిన్న వ్యాపారులకు జీవనాధారం కల్పిస్తూ సాగే ఈ సంతలు పల్లె జీవితాల్లో కొత్త కాంతులను నింపుతున్నాయి.స్థానిక ఉత్పత్తుల మార్కెటింగ్ కు కూడా ఇవే ఆనవాలుగా నిలుస్తున్నాయి.ఒకనాటి పల్లె జీవితాలకూ,ఇప్పటికీ మార్పులు వచ్చినా కూడా సంతలే తమకు కాస్తో కూస్తో ఆర్థిక చేయూత ఇస్తున్నాయని ఇక్కడికి వస్తున్న చిన్న చిన్న వ్యాపారులు చెబుతూ ఉన్నారు.