SAKSHITHA NEWS

సాక్షిత : ప్లోరైడ్ భూతం నుండి విముక్తి కల్పించిన ఘనత TRS ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మునుగోడ్ నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండల కేంద్రంలోని సునంద ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన TRS కార్యకర్తల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. ప్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని నాటి ప్రభుత్వాలను ప్రజలు కోరితే పట్టించుకోలేదన్నారు.
ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజలు ప్లోరైడ్ వలన పడుతున్న ఇబ్బందులను
తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి KCR చొరవతో శాశ్వతంగా పరిష్కరించబడిందని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి స్వార్ధం కారణంగానే మునుగోడ్ ఉప ఎన్నిక వచ్చిందని ధ్వజమెత్తారు. మునుగోడ్ MLA గా గెలిపించిన ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ను మరిచి, కాంట్రాక్టు ల పైనే శ్రద్ధ చూపారని అన్నారు.
MLA గా గెలిచిన 4 సంవత్సరాల తర్వాత నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు గుర్తుకొచ్చాయా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి MP గా వ్యవహరిస్తున్న నీ అన్న ఈ ప్రాంత అభివృద్ధి కి ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే రైతు బీమా క్రింద 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ రైతు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. పేదింటి ఆడపడుచు పెండ్లికి లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలులో లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం మన ఊరు మన బస్తీ కార్యక్రమం క్రింద 7200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. మునుగోడ్ నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్రంలో అధికారంలో ఉన్న TRS పార్టీతోనే సాధ్యం అవుతుందన్నారు. TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుతో నియోజకవర్గం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. BJP ని గెలిపిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. BJP నుండి MLA లు గా గెలిచిన దుబ్బాక, హుజురాబాద్ నియోజకవర్గాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెచ్చారు, ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నవంబర్ 3 వ తేదీన జరిగే ఎన్నికల్లో
నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న TRS ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుండి TRS పార్టీలో చేరిన వారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, నాంపల్లి MPP రవీందర్ రెడ్డి, ZPTC AV రెడ్డి, MPTC వెంకన్న గౌడ్, సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS