SAKSHITHA NEWS

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత అవాస్తవం

యూనివర్సిటీ విద్యార్థులు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా చదువుకోండీ

తప్పుడు ప్రకటన ఇచ్చిన అధికారికి షోకాజ్ నోటీసు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

సాక్షిత

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత అంటూ కొంతమంది ప్రకటనలు ఇవ్వడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో తాను విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. వెను వెంటనే విచారణ చేసిన అధికారులు విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం లేదని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తాగునీరు, విద్యుత్తు కొరత మూలంగా మే ఒకటి నుంచి, 31 మే వరకు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లు, మెస్ లు మూసి వేస్తున్నట్టు చీఫ్ వార్డెన్ ఒక ప్రకటన చేశారని, దీంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైనట్టు గమనించి తమ ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని 33/11 కెవి సబ్ స్టేషన్ నుంచి రెండు ప్రత్యేక 11kv ఫీడర్ల ద్వారా నిరంతరం యూనివర్సిటీ మొత్తానికి విద్యుత్ సరఫరా జరిగిందన్న విషయం మీటర్ రీడింగ్ ల ద్వారా స్పష్టమైనట్టు అధికారులు వారి నివేదికలో పేర్కొన్నట్టు తెలిపారు. వాస్తవాలు ధ్రువీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసిన చీఫ్ వార్డెన్ కు యూనివర్సిటీ రిజిస్టార్ ద్వారా షోకాస్ నోటీసు జారీ చేసినట్టు తెలిపారు.
యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. విద్యుత్తు, తాగునీటి సదుపాయాలను వెనువెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించామన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు ఏమాత్రం ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, నిశ్చింతగా యూనివర్సిటీలో ఉండి స్వేచ్ఛగా చదువుకోవచ్చు అన్నారు. ఖాళీ చేయాల్సిన అవసరం విద్యార్థులకు ఏమాత్రం లేదన్నారు.
గత ప్రభుత్వం అలవాటు మాదిరిగానే ఈ ఏడాది అధికారులు ప్రకటన చేసినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. గత ఏడాది జారీ చేసిన ప్రకటన తమ వద్ద ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.

WhatsApp Image 2024 04 29 at 8.59.52 PM

SAKSHITHA NEWS