SAKSHITHA NEWS

లేబర్ కోడ్ నిరసిస్తూ కార్మిక సంఘాల నిరసన – మధు, గపూర్ సహా కార్మిక సంఘాల నేతల అరెస్ట్

                                              సాక్షిత, తిరుపతి బ్యూరో:  కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన కార్మిక మంత్రుల జాతీయ సదస్సును అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్మిక సంఘాల నేతలను, మాజీ ఎంపీ పి.మధు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్  సహా పలువురు నేతలను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం నుంచి పోలీసులు కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేయడంకై  తీవ్రమైన ప్రయత్నం చేశారు. సిఐటియు, ఐఎఫ్టియు నేతలు రహస్య ప్రదేశాలకు వెళ్లిపోవడంతో పోలీసులు నేతల ఆచూకీ కనుక్కోవడం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేతలు స్విచ్ ఆఫ్ చేయడంతో ఏం జరుగుతుందో తెలియక పోలీసులు తికమక పడ్డారు. గురువారం నాటి ఉదయం ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ సహా  కార్యకర్తలను బైరాగి పట్టెడలోని వారి కార్యాలయంలో పోలీసులు అరెస్టు చేశారు. నేతలు, కార్యకర్తలు పోలీసులను ఛేదించుకొని ప్రదర్శన చేయడానికి ప్రయత్నించడంతో వారిని అరెస్టు చేసి రామచంద్రపురంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపం కు తరలించారు. అనంతరం సిఐటియు, ఐఎఫ్టియు నేతలు కలిసి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి భారీ ప్రదర్శన చేయనున్నట్టు ప్రకటించారు. మాజీ ఎంపీ పెనుమల్లి మధు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో పదిన్నర గంటలకు పంచముఖ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. 10.35కు అన్ని వైపుల నుంచి కార్యకర్తలు ఎర్రజెండాలతో బ్యానర్లతో పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రదర్శన గాంధీ రోడ్డు వైపు ప్రారంభమైంది. గాంధీ రోడ్డు నుంచి ప్రదర్శన ప్రారంభమైన ఐదు, పది నిమిషాల లోపే పోలీసులు ప్రదర్శన వద్దకు చేరుకున్నారు. పలువురు సిఐలు, పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసుల సంఖ్యాబలం సరిపోకపోవడంతో ప్రదర్శన కారులు  పోలీసులను నెట్టివేసి గాంధీ రోడ్డులో ప్రదర్శన నిర్వహించారు. ఈలోపు పోలీసు వ్యాన్లలో పోలీసులు, సచివాలయ మహిళా పోలీసులను పెద్ద సంఖ్యలో తీసుకువచ్చి వ్యాన్లు, జీపులు గాంధీ రోడ్డులో అడ్డుగా నిలిపి ప్రదర్శనను అడ్డుకున్నారు. ప్రదర్శనను నిలువురించడానికి తీవ్రమైన ప్రయత్నం చేశారు. ప్రదర్శన కారులు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో పెద్ద ఎత్తున పెనుగులాట జరిగింది. పోలీసులు పెనుమల్లి మధును బలవంతంగా తీసుకువెళ్లి జీపులో వెస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ ను అరెస్టు చేసే క్రమంలో తోపులాటలో ఆయన కింద పడిపోయారు. దీంతో కార్యకర్తలు తిరగబడి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అనంతరం పోలీసులు అరెస్టుకు సహకరించాలని విజ్ఞప్తి చేసినా గఫూర్, నేతలు  అంగీకరించకపోవడంతో బలవంతంగా పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది. నాయకులను బలవంతంగా ఈడ్చుకుంటూ, దౌర్జన్యంగా లాక్కు  వెళ్లి పోలీస్ జీపులను, వ్యాన్లను ఎక్కించారు. అనంతరం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ప్రదర్శన ఆంజనేయస్వామి గుడి నుంచి ఘటన జరుగుతున్న ప్రాంతానికి రావడంతో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ ను వారి నేతలను బలవంతంగా అరెస్టు చేశారు. మహిళలు  పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వారిని అరెస్టు చేయడం పోలీసులకు తల నొప్పిగా మారింది. రాష్ట్ర నేతలు మధు, గఫూర్, ప్రసాద్ లు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను హరించేందుకు రాష్ట్రాల కార్మిక శాఖా మంత్రుల సమావేశం నిర్వహిస్తుంటే ఆ సదస్సుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వడం దారుణమని విమర్శించారు. కార్మిక హక్కులు హరించడానికి సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు తాము ప్రయత్నిస్తుంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుని  గౌరవించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమను అమానుషంగా అరెస్టు చేయడం  తీవ్రమైనది గా పరిగణిస్తున్నామని అన్నారు. తిరుపతిలో కార్మిక సంఘాల నేతల అరెస్టును నిరసిస్తూ 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేయ నున్నట్లు వారు ప్రకటించారు. అనంతరం నేతలను కార్యకర్తలను రామచంద్రపురం పోలీస్ స్టేషన్కు తరలించి ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్బంధించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, సిఐటియు నేతలు టి. సుబ్రహ్మణ్యం, జయచంద్ర, పి.సాయిలక్ష్మి, ఆర్. లక్ష్మీ, జయంతి, వేణు, మురళి, బుజ్జి, రవి, ఉరుకుంద్, యుగంధర్, రామ్మూర్తి లతో పాటు ఐఎఫ్టియు నేతలు హరికృష్ణ, వెంకటరత్నం, విజయకుమార్, గంగాభవాని తదితరులు అరెస్టయ్యారు. అంతకు ముందు ఎఐటియుసి నేతలు రాధాకృష్ణ, కుమార్ రెడ్డి, శివ, ఎఐఎఫ్ టియు నేత మీరయ్య అరెస్టు అయ్యారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాధవను గృహ నిర్బంధంగా గమనించారు. సిఐటియు జిల్లా కోశాధికారి జి. బాలసుబ్రమణ్యం, మునిరాజాలను అరెస్టు చేసి తూర్పు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

SAKSHITHA NEWS