మంత్రి కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదు : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కి జాతీయంగా, అంతర్జాతీయంగా వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సంచలనాల కోసం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మండిపడ్డారు. పేపర్ లీకేజీకి సంబంధించి మంత్రి కేటీఆర్ అన్ని విషయాలు సమగ్రంగా చెప్పేసరికి రేవంత్ రెడ్డి అధికారులపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టారన్నారు.
ఆయా గ్రామాల్లో ఎంత మంది గ్రూప్-1 ఎగ్జామ్ రాశారో తెలియడానికి అధికారుల సాయం కావాలా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బీజేపీకి ఏజెంట్‌లా పని చేస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. సిట్ అధికారిని ఆంధ్రా అధికారి అని అనడం సరైంది కాదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి రేవంత్.. ఆయన ఇప్పుడు నీతులు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. రాహుల్‌పై అనర్హత వేటు వేసిన బీజేపీతో రాహుల్ కలిసిపోయాడని ఎమ్మెల్యే విమర్శించారు. కేటీఆర్ కి నీతులు బోధించే స్థాయి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌కు లేదు అని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్పష్టం చేశారు. సంస్కారం నేర్పితే ముందుగా బండి సంజయ్‌కు రఘునందన్ నేర్పాలన్నారు. రఘునందన్ ఓ కాగితపు పులి అని విమర్శించారు. ఎక్కడ ఏ పని చేయాలో రఘునందన్‌కు తెలియదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.