KG to PG Campus @Gambhirao Peta…Video shared by KTR
కేజీ టు పీజీ క్యాంపస్@గంభీరావ్ పేట…వీడియో షేర్ చేసిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ప్రతి విద్యార్థిని ఉన్నత విద్యావంతుడిగా మార్చాలన్న లక్ష్యంతో అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యావ్యవస్థను అమలు చేస్తోంది. ఒకే క్యాంపస్‌లో కేజీ టు పీజీ ఉండేలా చర్యలు తీసుకుంటోంది.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తెలంగాణలో మారుతున్న విద్యా రంగాన్ని మీకు పరిచయం చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది గంభీరావ్‌పేటలోని కేజీ టు పీజీ క్యాంపస్ అని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి వసతులతో కేజీ టు పీజీ విద్యావ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. మన ఊరు – మన బడి పథకంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని గంభీరావ్‌పేటలో కేజీ టు పీజీ క్యాంపస్‌ను అన్ని రకాల వసతులతో తీర్చిదిద్దబడింది.
అంగన్వాడీ కేంద్రం, ప్రీ ప్రైమరీ స్కూల్, ప్రైమరీ స్కూల్, హై స్కూల్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీని ఆరు ఎకరాల్లో నిర్మించడం జరిగింది. ఈ విద్యాలయంలో 3,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో పాఠాలను బోధిస్తున్నారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్కూల్ 250 మంది విద్యార్థులతో విజయవంతంగా కొనసాగుతోంది.
మొత్తం 90 తరగతి గదులతో పాటు కంప్యూర్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వెయ్యి మంది విద్యార్థులకు సరిపడ డైనింగ్ హాల్ ఉంది. ఫిపా ప్రమాణాలతో కలిగిన ఆస్ట్రో టర్ఫ్ మైదానాన్ని 44 వేల చదరపు అడుగుల్లో నిర్మించారు. ఫుట్ బాల్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీతో పాటు అథ్లెటిక్స్‌కు సంబంధించిన స్టేడియంలను కూడా ఏర్పాటు చేశారు.