SAKSHITHA NEWS

సహ జీవన సంబంధాలను(లివిన్ రిలేషన్‌షిప్) నెరపడానికి ఇండియా పాశ్చాత్య దేశమేం కాదని, భారతదేశ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రజలు గౌరవించాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అహ్మద్ పేర్కొన్నారు.

తనతో సహ జీవనం చేస్తున్న 29 ఏళ్ల మహిళను ఆమె కుటుంబం బలవంతంగా నిర్బంధించిందని ఆరోపిస్తూ 32 ఏళ్ల ఆశిష్ కుమార్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పాశ్చాత్య దేశంలో మనం జీవించడం లేదని గుర్తుంచుకోవాలని పిటిషనర్‌కు న్యాయమూర్తి హితవు పలికారు. సంస్కృతి, సంప్రదాయాలు భారతదేశానికి కిరీటం లాంటివని, వాటిని గౌరవించాలని సూచించారు.

సమాజంలో సదరు మహిళ, ఆమె కుటుంబం పరువును తీసే దురుద్దేశంతో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారని జస్టిస్ షమీమ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.

మహిళ కుటుంబంపై ఒత్తిడిని పెంచి, అవమాన భయానికి గురి చేసి, రాజీని కుదుర్చుకునేందుకే ఈ పిటిషన్‌ దాఖలు చేసినట్లుగా అనిపిస్తోందన్నారు.

ఇతరుల పరువు, ప్రతిష్ఠలు తీసే ఇలాంటి పిటిషన్‌ను కోర్టు సమర్ధించబోదని స్పష్టం చేశారు.

హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు పిటిషనర్‌పై రూ.25వేల జరిమానా కూడా విధించారు.

Whatsapp Image 2024 01 24 At 9.05.36 Am

SAKSHITHA NEWS