హైదరాబాద్:-పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్‌పీ పొత్తు ఖరారు అయింది. పొత్తులో భాగంగా బీఆర్ఎస్ 15 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా.బీఎస్పీకి రెండు సీట్లు కేటాయించింది. హైదరాబాద్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీని ప్రజలు ఓడించారు.
దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తోంది. మెుత్తం 17 స్థానాలకు గాను మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ (BSP)తో పొత్తుకు ఓకే చెప్పింది. వారం రోజుల క్రితమే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరగా.. సీట్ల షేరింగ్‌పై ఇవాళ క్లారిటీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.