గజ్వేల్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించాలి.. పొలిమేరలకు తరమాలి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన విజయభేరి జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ ను మీరు పాతాళానికి తొక్కాలనుకుంటే.. కామారెడ్డికి పారిపోయిండు..కామారెడ్డికే కాదు.. కన్యాకుమారికి పారిపోయిన ప్రజలు కేసీఆర్ ను ఓడించి తీరతారు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లుండే.. ఇయ్యాల ఎర్రవల్లిలో ఎట్లుండు గమనించాలన్నారు. రైతుల మేలుకంటే కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకపోయేందుకె ప్రాధాన్యతనిచ్చిండు అని విమర్శించారు.
ఈ ప్రాంత రైతుల భూములను ముంచి.. ఆయన బంధువుల భూములను కాపాడుకుండు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతుల వడ్లు కొనని కేసీఆర్… ఆయన ఫామ్ హౌస్ లో పండిన వడ్లను కావేరి సీడ్స్ కు క్వింటా రూ.4500లకు అమ్ముకుండు.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏమైనా బంగారం పండుతుందా? అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ను రెండు సార్లు ఎమ్మెల్యేను చేస్తే… మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచిండు. కొండపోచమ్మలో మిమ్మల్ని తోసిండు, రంగనాయక్ సాగర్ లో ముంచిండు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ముంపు బాధితుల పక్షాన ఆనాడు ఏటీగడ్డ కిష్టాపూర్ లో నేను దీక్ష చేశా. అధికారంలోకి రాగానే ముంపు బాధితులకు నష్ట పరిహారం ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు.
“నేను ఇక్కడికి వస్తున్నానని కేసీఆర్ కొడంగల్ పోయిండు..నా నోరు తెరిస్తే కంపు అని కొడంగల్ లో కేసీఆర్ అంటుండు. ఇద్దరం పోదాం… డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసుకుందాం. ఎవరి నోట్లో కంపు ఉందో తేలుద్దాం… పొద్దున లేస్తే ఎత్తుడు పోసుడే నీ పని.. నీతో నాకు పోలికా?” అని రేవంత్ రెడ్డి కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకొనివ్వం.. ముమ్మాటికీ దోచుకున్న సొమ్మును కక్కిస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బక్కోడు కాదు… లక్షకోట్లు మింగి, పదివేల ఎకరాలు దోచుకున్న బకాసురుడు కేసీఆర్ అని విమర్శించారు. గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించండి… ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.