అభివృద్దిని చూడలేని కబోదులు….మంత్రి తలసాని
రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా BJP, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగిన సనత్ నగర్ నియోజకవర్గ BRS పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఇండ్లు లేని పేద ప్రజల కోసం నగరంలో ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించిందని, BJP, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మీకు కనిపిస్తలేవా అని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నాలుగున్నర సంవత్సరాల నుండి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేద బాగోగులు ఆలోచించే గొప్ప మనసున్న ముఖ్యమంత్రి ఆలోచనల తోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించడం జరిగిందని వివరించారు. ఒక్క పైసా లబ్దిదారుడిపై భారం పడకుండా ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా 45 సంవత్సరాల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా నేడు ఎన్నికలు వస్తుండటం తో అది చేస్తాం…ఇది చేస్తామంటూ వస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నంత కాలం పదవులను కాపాడుకోవడం, తమ వారి బాగుకోసమే కాంగ్రెస్ నాయకులు పరితపించారని ఆరోపించారు. KCR నాయకత్వంలో అద్బుతమైన పాలన సాగుతుందని, ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. అత్యంత పేదరికంలో ఉన్న దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం అమలులో దేశంలోనే పెద్ద కదలికను తీసుకొస్తుందని, అన్ని రాష్ట్రాలలో ఈ పథకం అమలు కోసం ప్రజల నుండి డిమాండ్ రాబోతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.