రాష్ట్రంలో ఇసుక అక్రమాలు, దోపిడీ నిజమని కేంద్ర ప్రభుత్వం, జాతీయ హరిత ట్రైబ్యునల్ తేల్చడంతో జగన్ ముఠా పరిస్థితి తేలుకుట్టిన దొంగల్లా మారిందని ఎద్దేవా చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్రవ్యాప్తంగా 500కి పైగా రీచ్‌ల్లో వైకాపా నాయకులు పగలురాత్రి తేడాలేకుండా అడ్డుఅదుపు లేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారన్నారు. ఈ అక్రమతవ్వకాల ఫోటోలు, నకిలీ బిల్లు పుస్తకాలు, తదితరాలను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ సేకరించిందని వాటిపై తాడేపల్లి బాస్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు ప్రత్తిపాటి. పర్యావరణ అనుమతులు లేకున్నా ఒక్కో రీచ్ నుంచి 2 వేల టన్నుల వరకు ఇసుక తవ్వి దోచేస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడయిందన్నారు.
రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లపై వివరాలు అడిగితే ప్రభుత్వం, గనులశాఖ ఇవ్వకపోవడం వారి మోసపూరిత కుట్రలకు నిదర్శమన్నారు ప్రత్తిపాటి. ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతజిల్లా చిత్తూరులో పర్యావరణ అనుమతులు దాటి తవ్వకాలు చేసినందుకు ఎన్జీటీ రూ.18కోట్లు జరిమానా విధించిన విషయం నిజం కాదా అని ఆయన నిలదీశారు. రాష్ట్రం మొత్తాన్ని ఇసుక మాఫియాకు అప్పగించిన జగన్ దోపిడీపర్వంలో స్థానిక అవసరాలకు ఇసుక దొరక్క, పనుల్లేక 130మంది భవన నిర్మాణ కార్మికుల బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్తిపాటి. వైకాపా నేతల ఇసుక దోపిడీ వల్లనే అన్నమయ్య జలాశయం కొట్టుకునిపోయి 48మంది ప్రాణాలు కోల్పోయారని, ఊళ్లకు ఊళ్లే నామరూపాల్లేకుండా పోయాయన్నారు.
ఈ అక్రమాలు ప్రశ్నించిన వారిని పోలీసు కేసులు పెట్టి వేధించడం, పోలీస్స్టేషన్లలో పెట్టి కొట్టించడం మరీ దారుణమన్నారు ప్రత్తిపాటి. ఇసుక మాఫియాలను ప్రశ్నించిన పాపానికే దళిత యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం చేయడం వీరి అరాచకాలకు పరాకాష్టగా పేర్కొన్నారు. ఈ అక్రమాలకు కొమ్ముకాస్తున్న ప్రతి ప్రభుత్వ అధికారి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. చుట్టూ ఇసుకాసురులు రెచ్చిపోతున్నా కళ్లకుగంతలు కట్టుకున్న కలెక్టర్లకు తగిన పాఠాలు ముందుంటాయన్నారు. మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లు దర్యాప్తు సంస్థల నుంచి చర్యలు ఎదుర్కోక తప్పదన్నారు ప్రత్తిపాటి.