జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 7, 9 వార్డులకు సంబంధించి చేపల మార్కెట్ వెనుక గల సచివాలయం ఆవరణలో శనివారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ లో కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ పాల్గొని ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని వార్డుల్లో ని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు.
ప్రతి ఇంటికి వాలంటీర్, ఆరోగ్య కార్యకర్తలు, సచివాలయ కార్యదర్శులు వచ్చి పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి టోకెన్ ఇచ్చి, ఆరోగ్య సురక్ష శిబిరానికి తీసుకువచ్చి వైద్యం అందిస్తున్నామని అన్నారు. ప్రజలు నేరుగా వైద్య శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకోవచ్చు అన్నారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీ సమస్యలు, జనరల్ మెడిసిన్, కంటి వైద్యం అందిస్తున్నారని అన్నారు. అలాగే అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు.
నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 800 మంది సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. వీరందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశామని అన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులపై నివేదిక తయారు చేసి ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తారని అన్నారు. ప్రజలందరూ ఈ జగనన్న ఆరోగ్య సురక్షలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దూదికుమారి, మునిసిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, వెటర్నరీ ఆఫీస్ డాక్టర్ నరేంద్ర రెడ్డి, సూపరింటెండెంట్ రవి, తదితరులు పాల్గొన్నారు.