Is this the strategy of YS Sharmila in Telangana.. Bhumi Puja for party office in Paleru today
తెలంగాణలో వైఎస్.షర్మిల వ్యూహం ఇదేనా..నేడు పాలేరులో పార్టీ కార్యాలయానికి భూమి పూజ
ఖమ్మం: తెలంగాణలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి.బీజేపీ, టీఆర్ఎస్,కాంగ్రెస్, వామపక్షాలు,తెలుగుదేశం పార్టీ మినహిస్తే మిగిలిన పార్టీలకు అంతగా ఉనికిలేదనే చెప్పుకోవాలి.రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా ప్రజల నోట్లో నానే పార్టీలు కొన్నే ఇటీవల కాలంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ కూడా ప్రజల నోట్లో వినిపిస్తోంది.
ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఎంత బలం ఉందనేది పక్కన పెడితే ఇటీవల కాలంలో ఆ పార్టీ అధినేత్రి వైఎస్.షర్మిల తరచూ వార్తలో నిలుస్తున్నారు. వరంగల్ జిల్లా పాదయాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వం,ఆ పార్టీ ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం,ఆ తర్వాత ఆమె వాహనంపై దాడి, పాదయాత్రకు అనుమతి నిరాకరణ,ప్రగతి భవన్ ముట్టడి,ఆమరణదీక్ష పేరుతో షర్మిల చేసిన హడావుడితో వైఎస్సార్ తెలంగాణ పార్టీ వార్తల్లో ఉంటూ వస్తోంది.
తాజాగా ఆమె పోటీ చేసే నియోజకవర్గంపై కూడా సూచనప్రాయంగా స్పష్టత ఇవ్వడంతో ఇక రానున్న శాసనసభ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కసరత్తు ముమ్మరం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీలో ఉంటానని గతంలోనే ప్రకటించారు.
ఆ తర్వాత పలు ప్రచారాలు తెరపైకి వచ్చినా, వాటన్నింటినీ పక్కన పెడుతూ పాలేరు సెగ్మెంట్ పరిధిలో పార్టీ ఆఫీస్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. డిసెంబర్ 16వ తేదీ శుక్రవారం భవన నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ చేయనున్నారు.ఖమ్మం బైపాస్ రోడ్లో ఉన్న కరుణగిరి చర్చి సమీపంలో ఇప్పటికే ఆఫీస్నిర్మాణం కోసం భూమి కొన్నారు.
హైదరాబాద్ లోటస్‌పాండ్ లో ఆఫీస్ తర్వాత ఇతర జిల్లాల్లో ఎక్కడా పార్టీ కోసం సొంతంగా భూమి కొని ఆఫీసులు ఏర్పాటు చేయలేదు.మొదటిసారిగా పాలేరు నియోజకవర్గం కోసం ఆఫీస్ నిర్మాణం చేస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో పాలేరు సెగ్మెంట్ పై షర్మిల సీరియస్‌గానే నజర్ పెట్టినట్టు తెలుస్తోంది.
వీలైనంత త్వరగా ఆఫీస్నిర్మాణాన్ని కంప్లీట్ చేసి,ఇతర పార్టీల నుంచి చేరికలను,ఎన్నికల వ్యూహాలను ఇక్కడి నుంచే ఖరారు చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో కొంత ప్రభావం చూపించే అంచనాల నేపథ్యంలోనే షర్మిల ఈ జిల్లాపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
మరోవైపు ఆమె తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి.అధికార బీఆర్ఎస్ ఆదేశాల ప్రకారమే షర్మిల పనిచేస్తున్నారని కొన్ని పార్టీలు విమర్శిస్తుంటే అధికార బీఆర్ఎస్ మాత్రం బీజేపీ వదిలిన బాణం షర్మిల అంటూ ఆరోపిస్తున్నారు.తాను ప్రజల కోసం పనిచేసే నాయకురాలునంటూ షర్మిల చెబుతూ వస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో షర్మిల ఎక్కడెక్కడ పోటీ చేస్తారు.ఒంటరిగానే పోటీ చేస్తారా ఏవైనా పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తారా అనేది కూడా భవిష్యత్తులో తేలనుంది. ప్రస్తుతానికి మాత్రం తమ పార్టీకి ఎంతో కొంత బలంతో పాటు.. ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న ప్రజలు ఎక్కువుగా ఉన్న చోట్ల పార్టీని బలోపేతంపై షర్మిల దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.