హైదరాబాద్: ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ తమిళిసై వ్యవహరించారని భారాస ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నామినేటెడ్ కోటా కింద సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్ తిప్పిపంపడాన్ని ఆమె తప్పుబట్టారు..
భారాస బీసీలకు పెద్దపీట వేస్తుంటే.. భాజపా వాటిని అడ్డుకునేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. శాసన మండలి ఆవరణలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో కవిత పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
”ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్ ఆమోదించడం సంప్రదాయం. అనేక కారణాలను చెప్పి పేర్లను ఆమె తిరస్కరించారు. రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం నడుస్తోందా? భాజపా రాజ్యాంగం నడుస్తోందా?పలు రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారు. గవర్నర్లే ఇలా వ్యవహరించడం దురదృష్టకరం. రాజ్యాంగ వ్యవస్థలకు పరిధులు, పరిమితులు ఉంటాయి. బీసీ వర్గాలకు భాజపా పెద్ద పీట వేస్తోంది. బీసీ వ్యతిరేక పార్టీ అని భాజపా మరోసారి నిరూపించుకుంది” అని కవిత వ్యాఖ్యానించారు..