అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం- బుధవారం మరో రెండు శాఖలతో సమీక్ష నిర్వహించిన కమిటీ
- మరింత అధ్యయనం కోసం త్వరలో జిల్లాల పర్యటన
-హైదరాబాద్
రాష్ట్రంలో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ నేడు మధ్యంతర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. నెల రోజులుగా ఆరు సార్లు సమావేశమైన కమిటీ వివిధ ప్రభుత్వ శాఖలు, రెవెన్యూ వర్గాలు, పోర్టల్ నిర్వహణ కంపెనీలు, భూ నిపుణులతో చర్చలు జరిపింది. ప్రాథమిక స్థాయిలో కమిటీ అధ్యయనం దాదాపు 90 శాతం పూర్తయింది. క్షేత్రస్థాయి నుంచి మొదలుకొని రాష్ట్రస్థాయి వరకు రెవెన్యూశాఖలో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచిస్తూ మధ్యంతర నివేదిక సిద్ధం చేసింది.
ధరణిలో ఉన్న 33 మాడ్యూల్స్ను రెండు కేటగిరిలుగా విభజించిన కమిటీ మధ్యంతర నివేదికలో సత్వరమే పరిష్కారమయ్యే సమస్యలను ప్రస్తావించారు. సర్వే నెంబరు మిస్సింగ్, ఎక్స్టెన్షన్ కరెక్షన్ చేయాలంటే ఆ ఫైలు సీసీఎల్ఏ వరకు వెళ్లాల్సి వస్తోంది. డిజిటల్ పాస్బుక్ మొదటి పేజీలో తప్పులు సరిచేయించుకోవాలంటే కలెక్టర్ను ఆశ్రయించాలి. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను సరిచేయించుకునేందుకు యజమానులు నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వీటిని కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్కు ప్రాధాన్యత క్రమంలో బదలాయించాలని కమిటీ సూచించినట్టు తెలుస్తోంది. భూ సమస్యలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ నేటి నుంచి శాసన సభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ధరణిపై చర్చ జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కమిటీ మధ్యంతర నివేదికను రూపొందించింది. సమస్యను మరింత లోతుగా అధ్యయంన చేసేందుకు గానూ కమిటీ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనుంది. ఇందుకు సంబంధించిన టూర్ షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్టు సమాచారం.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై సమీక్ష
బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో సమావేశమైన ధరణి కమిటీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వ భూముల బదలాయింపులు, ఇతర సమస్యలు ధరణికి ముందు, తర్వాత ఎలా ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో మాన్యవల్ పద్ధతిలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములపై ఉన్న నిషేధం ఎలా అమలయ్యేది ఇప్పుడెలా అమలవుతోందని ఆరా తీశారు. అనంతరం తెలంగాణ స్టేట్ ఇండిస్టీస్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ (టీఎస్ఐఐసీ)తో కమిటీ చర్చించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థ పారిశ్రామిక వాడల కోసం కొనుగోలు చేసిన భూములెన్ని? అందులో ఎంత భూమిని పరిశ్రమలు పెట్టేందుకు కేటాయించారు? అడిగి తెలుసుకున్నారు. చాలా భూముల నాలా కన్వర్షన్ లేక పోవడం వల్ల రైతు బంధు పడుతున్నట్టు వస్తున్న ఆరోపణలపై అధికారులతో చర్చించారు.