SAKSHITHA NEWS

ప్రేమ పేరిట ఓ యువతి జీవితాన్ని నాశనం చేశాడో మృగాడు. ప్రేమించానన్నాడు.. పెళ్లాడతానన్నాడు.. కాదంటే చంపేస్తా.. నేనూ చచ్చిపోతానని బెదిరించి మారీ ఆమెను వేధించి మరీ వివాహం చేసుకున్నాడు.

కట్టుకున్న భార్యను గుండెల్లో పెట్టుకుని చూసుకోవడానికి బదులు.. పెళ్లి జరిగిన రోజే తాళి తెంచి, నడి రోడ్డుపై అనాథలా వదిలేసి వెళ్లిపోయాడు.

దీంతో అర్ధరాత్రి నడిరోడ్డుపై ఎటెళ్లాలో తెలియక చివరకు పోలీసులను ఆశ్రయించింది.

ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం పాలేరు పంచాయతీ మోతకుంటలో సోమవారం (మార్చి 18) వెలుగు చూసింది.

చిత్తూరు జిల్లా

బంగారుపాళ్యం మండలం పాలేరు పంచాయతీ శేషాపురం గ్రామానికి చెందిన యమున (21) మోతకుంట గ్రామానికి చెందిన అభిరామ్‌(22) స్థానిక ప్రైవేటు డిగ్రీ కాలేజీలో చదువుకునేవారు. అయితే అభిరామ్‌ నిత్యం ప్రేమ పేరిట యమునను వేధించేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని, నిరాకరిస్తే చంపి, తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడు. భయాందోళనలకు గురైన యమున అతడి ప్రేమను అంగీకరించింది. ఈ క్రమంలో మార్చి 6వ తేదీన తమిళనాడులోని అరుణాచలం దేవస్థానానికి కారులో వెళ్లి, అక్కడ పెళ్లి చేసుకుని వేకువజామున అభిరామ్‌ తన ఇంటికి తీసుకెళ్లాడు. తాము పెళ్లి చేసుకున్నామని తెల్పగానే.. అతడి తండ్రి శేఖర్‌, తల్లి నాగభూషణమ్మ, అన్నలు క్రిష్ణ, అనిల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

తమకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు యమునపై దాడికి పాల్పడ్డారు. ఆమె మెడలోని తాళి తెంచి, చంపుతామని బెదిరించి.. ఆమె వద్ద ఉన్న మొబైల్‌, రెండున్నర గ్రాముల బంగారు ఉంగరాన్ని లాక్కుని దాడి చేశారు. అనంతరం ఆమెను బైక్‌పై ఎక్కించుకుని శేషాపురం సర్వీసు రోడ్డులో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఆమె ఈ నెల 7న మదనపల్లెలోని స్నేహితురాలు రెడ్డిరాణి వద్దకు చేరుకుని తన గోడు వెళ్లగక్కి రోధించింది. ఆమె వద్ద ఫోన్‌ తీసుకుని భర్త అభిరామ్‌కు ఫోన్‌ చేసి తనకు న్యాయం చేయాలని కోరింది. అయితే కొద్దికాలం ఆమెను అక్కడే ఉండాలని, త్వరలోనే ఇంటికి తీసుకెళ్తానని నమ్మబలికాడు. అతడి మాటలు గుడ్డిగా నమ్మిన యమున అప్పటి నుంచి భర్త రాకకోసం ఎదురుచూడసాగింది. ఈ క్రమంలో సోమవారం అతడికి ఫోన్‌ చేస్తే కట్‌ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యమున బంగారుపాళ్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు.

WhatsApp Image 2024 03 19 at 2.29.19 PM

SAKSHITHA NEWS