కరీంనగర్ జిల్లా :
మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్ మగాడివైతే టీడీపీలో ఉండి గెలవాలని సవాల్ విసిరారు. పొన్నం మీడియాతో మాట్లాడుతూ… ఔట్ డేటెడ్ అని మీ వినోద్ రావుని అన్నవా గంగుల అంటూ ప్రశ్నించారు. ‘‘నా ఓటమి గురించి మాట్లాడుతున్నావ్.. సీఎం కూతురు కవిత ఓడిపోలేదా’’ అని వ్యాఖ్యలు చేశారు. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న కరీంనగర్ పార్లమెంట్‌లో వినోద్ రావు ఎంపీగా ఓడిపోలేదా అని నిలదీశారు.
గంగుల దొంగ రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. దున్నపోతులా బలిసి రైతుల గురించి పట్టించుకోవట్లేదని విరుచుకుపడ్డారు. బీజేపీ నేత బండి సంజయ్, మంత్రి గంగుల ఆలయాల్లో కలుసుకుంటున్నారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం రోజుకో పండుగను నిర్వహించడంపైనా మాజీ ఎంపీ విమర్శలు గుప్పించారు. దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బెల్ట్ షాప్‌ల పండుగ మరిచిపోయారు అంటూ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.
కాగా.. పొన్నం ప్రభాకర్‌పై మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లోనే పొన్నం విలువ బయటపడిందని… కనీసం కార్పోరేటర్‌ను కూడా గెలిపించుకోలేదని ఎద్దేవా చేశారు. ఎంఐఎం మాత్రమే కాదని.. తన మీద కేఏ పాల్, షర్మిల కూడా పోటీ చేయవచ్చన్నారు. తన పని తాను చేసుకుంటానని.. తన జోలికి వస్తే విడిచిపెట్టబోనని హెచ్చరించారు. తన మీద పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ కేసులు వేశారన్నారు. వారిద్దరూ ఒక్కటేనన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ విచారణలో ఏమీ తేలలేదన్నారు. ఎన్నికల ముందు గానా బజానాలు రావడం సహజమేనన్నారు. బీఆర్ఎస్ 60 శాతం, కాంగ్రెస్, బీజేపీ రెండు కలిపి నలభై శాతమేనని గంగుల అన్నారు….