If the implementation of guarantees is questioned, they are attacked
హామీల అమలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు
గవర్నర్ కు వైఎస్ షర్మిల ఫిర్యాదు*
సాక్షిత హైదరాబాద్: ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తున్నందుకు తనపై దాడులు చేస్తున్నారని, పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రతినిధులతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
నర్సంపేటలో జరిగిన దాడి, అరెస్టు, హైదరాబాద్‌లో ప్రగతి భవన్‌కు వెళ్తుండగా అరెస్టు చేసిన తీరు తదితరాలను వివరించారు. అనంతరం షర్మిల విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే తెరాస ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు.
‘తెరాస కార్యకర్తల చేతిలో ధ్వంసమైన వాహనాలను ముఖ్యమంత్రికి చూపే ఉద్దేశంతో ప్రగతి భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించా. పోలీసులు అడ్డుకుని వాహనాలు అడ్డంగా పెట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. వాహనంలో ఉండగానే ఠాణాకు తరలించారు. పైగా నాపైనే కేసులు పెట్టారు.
అరెస్టు చేసిన తర్వాత మా నాయకులను కొట్టారు’’ అని ఆరోపించారు. కల్వకుంట్ల కవిత పేరు మద్యం కుంభకోణం కేసులో బయటపడిందని, ఇకపై ఆమె ట్విటర్‌లో కవితలు రాసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆంధ్రుల పెత్తనమేమిటని మాట్లాడే వారికి కేటీఆర్ సతీమణి ఏ ప్రాంతానికి చెందిన వారో తెలుసా? అని నిలదీశారు
. ‘నేను పుట్టి, పెరిగి, చదువుకుని, వివాహం చేసుకుంది ఇక్కడే. పిల్లలను కన్నదీ ఈ గడ్డమీదే. నా బతుకు తెలంగాణతో ముడిపడి ఉంది’’ అని పునరుద్ఘాటించారు. తన ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
షర్మిలపై చర్యలు తీసుకోవాలి..’
వనస్థలిపురం: వైతెపా అధ్యక్షురాలు షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెరాస నాయకుడు సతీష్‌రెడ్డి, మరికొందరు గురువారం వనస్థలిపురం ఠాణాలో ఏసీపీ పురుషోత్తంరెడ్డికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఉద్యమకారులు, సీఎం కేసీఆర్‌పై ఓ టీవీ ఛానల్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.