Harish Rao’s tireless efforts made Khammam Sabha a success
హరీశ్ రావు అవిశ్రాంత కృషితోనే ఖమ్మం సభ సక్సెస్
మంత్రి హరీశ్ రావుకు ఎంపీ నామ అభినందనలు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;
అందరి సమన్వయం, సహకారంతో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మహాద్భుతంగా అందర్నీ అబ్బురపర్చేలా ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను అత్యంత ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావును బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అభినందించారు. పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యయన పర్యటన ముగించుకుని, హైదరాబాద్ చేరుకున్న ఎంపీ నామ వెంటనే వెళ్ళి హరీశ్ రావును కలసి, పుష్పగుచ్చం అందజేసి, ప్రత్యేకించి, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో హరీశ్ రావు ఖమ్మం చేరుకుని, సభ ముగిసేంత వరకు ఖమ్మం జిల్లా ప్రజల మధ్యలోనే ఉంటూ నభ విజయవంతానికి దగ్గరుండి, ఏర్పాట్లు చేశారని అన్నారు. పండుగ రోజుల్లో కూడా ఆయన ఖమ్మంలోనే మకాం వేసి, సభ ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పర్యటించి, నాయకులందర్నీ ఏక తాటి పైకి తీసుకొచ్చి, జన సమీకరణ చేయించి, ఊహించిన దానికంటే మిన్నగా సభను సక్సెస్ చేయించిన ఘనత హరీశ్ రావుకే దక్కుతుందని నామ అన్నారు.
రేయింబవళ్లు నాయకులందరితో మాట్లాడుతూ సభ గురించి, వారిలో ఉత్సాహం, చైతన్యం నింపి, ప్రధాన భూమిక వహించారని నామ కొనియాడారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులను, మంత్రులను నిద్ర పోనివ్వకుండా సభ విజయవంతానికి అహర్నిశలు శ్రమించారని అన్నారు.
ఆయన చేసిన అవిరళ కృషి, పట్టుదల, శ్రమ ఫలితంగానే యావత్ దేశం అబ్బురపడేలా సభ సక్సెస్ చేసుకోగలిగామని నామ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో భవిష్యత్ లో పార్టీ నుంచి ఏ పిలుపు వచ్చినా ఇదే స్ఫూర్తితో పని చేస్తామని నామ స్పష్టం చేశారు.
కేసీఆర్ పిలుపుతో ఊరూవాడా కదలి, సభకు లక్షలాదిగా తరలివచ్చిన సామాన్య కార్యకర్తలకు, నాయక త్వానికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని నామ పేర్కొన్నారు.