SAKSHITHA NEWS

డమ్మీ తుపాకితో బెదిరించి నగల దుకాణంలో బంగారం దోచేసిన దొంగను ట్రాఫిక్‌ పోలీసులు వెంటాడి పట్టుకున్న ఉదంతం కాకినాడలో చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామానికి చెందిన 26 ఏళ్ల నూకల సతీష్‌ వ్యవసనాలకు బానిసై జులాయిగా తిరుగుతూ దొంగతనాలు చేస్తున్నా డు. ఈ క్రమంలో సతీష్‌ బుధవారం కాకినాడ దేవాలయం వీధిలోని తనిష్క్‌ జ్యూయలరీ షాప్‌లోకి వెళ్లాడు. బంగారం చైన్లు చూపించమని సేల్స్‌మ్యాన్‌ను కోరాడు.

అతడు పలు మోడళ్ల బంగారపు చైన్లు చూపిస్తుండగా.. తన జేబులో ఉన్న పిస్టల్‌ను తీసి సేల్స్‌మ్యాన్‌కు పాయింట్‌ బ్లాంక్‌లో గురిపెట్టి బెదిరించాడు. దీంతో సేల్స్‌మ్యాన్‌ బిత్తర చూపులు చూస్తూ ఉండిపోగా, సతీష్‌ చేతికి అందిన బంగారాన్ని లాక్కుని పరుగులంకించుకున్నాడు. వెంటనే తేరుకున్న సేల్స్‌మ్యాన్‌.. నిందితుడి వెనకాల పరిగెడుతూ పెద్దగా కేకలు వేయగా, సమీపంలో ట్రాఫిక్‌ పోలీసులు నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. అతడు తస్కరించిన 39 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని జ్యూయలరీ షాపు యాజమాన్యానికి అప్పగించారు. నిందితుడు ఉపయోగించింది డమ్మీ పిస్టల్‌గా గుర్తించి వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


SAKSHITHA NEWS